భాగ్యనగరి హైదరాబాద్ లోని సైదాబాద్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల బాలికపై జరిగిన హత్యాచారం ఇప్పుడు యావత్తు తెలంగాణను వణికిస్తోంది. ఆరేళ్ల చిన్నారిపై పాశవికంగా వ్యవహరించిన మృగాడు రాజు.. ఇప్పుడు తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంటిలోనే ఉన్న రాజు.. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే అదను చూసుకుని తప్పించుకున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి చాకచక్యంగా బయటపడిన రాజు.. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు అతడు ఎక్కడికి వెళుతున్నాడో కూడా అతడికి తప్పించి ఎవరికీ తెలియదు. చిన్నారి హత్యాచారంపై విపక్షాలన్నీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారు కాస్తంత ఆలస్యంగానే మేల్కొందని చెప్పాలి. ఈలోగానే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సీసీ కెమెరాలకు చిక్కినా..
సింగరేణి కాలనీలోని తన ఇంటి నుంచి ఘటన జరిగిన రోజే బయటకు వచ్చేసిన రాజు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం అతడి కోసం ఏకంగా 3 వేల మంది పోలీసులు వేట సాగిస్తున్నారట. అయినా కూడా రాజు జాడ తెలియరావడం లేదు. ఇలా కాదనుకున్న పోలీసులు నగరంలోని దాదాపుగా వెయ్యి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉప్పల్ రింగ్ రోడ్డులో కనిపించిన రాజు.. రోడ్డు దాటి ఓ వైన్ షాప్ దగ్గరకు వెళ్లాడు. అక్కడే తన చేతిలోని కవర్ ను పడేశాడు. ఆ కవర్ లో అతడి తువ్వాలు, కల్లు సీసా లభించాయి. అయితే ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్లేలోగానే అక్కడి నుంచి రాజు మాయమయ్యాడు. సైదాబాద్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండగా.. ఇప్పుడు అతడు సైబరాబాద్ పోలస్ కమిషనరేట్ పరిధిలో తచ్చాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో సైబరాబాద్ కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సూపర్ కాప్ స్టీఫెన్ రవీంద్ర నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఈ సందర్భంగా స్టీఫెన్ మాట్లాడుతూ రాజును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లుగా తెలిపారు. నిందితుడి జాడ తెలిసిన వారు 100కి ఫోన్ చేసి చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ.. డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చిన్నారి హత్యాచారంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని, తక్షణమే నిందితుడిని పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని హోం మంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
క్యూ కట్టిన నేతలు..
రాజు చేతిలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సింగరేణి కాలనీకి వెళ్లి బాధిత కటుంబాన్ని పరామర్శించారు. తాజాగా బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సింగరేణి కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించడంతో పాటుగా బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని తాను దీక్షకు దిగుతానని కూడా ఆమె సంచలన ప్రకటన చేశారు. బాధిత కుటుంబానికి వరుసగా రాజకీయ నేతల నుంచి పరామర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సింగరేణి కాలనీలో ఓ రేంజి హడావిడి నెలకొంది.
Must Read ;- అత్యాచారాంధ్రగా ఏపీ.. గుంటూరులో మరో దారుణం











