హైదరాబాద్ లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్‌తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాము విశాఖలో పర్యటించామని, అక్కడి వసతులు, సౌకర్యాలు తమకు ఎంతో సంతృప్తి ఇచ్చాయని సీఎం కు తెలిపిన జోయల్ రీఫ్‌మెన్ తెలియజేశారు. విశాఖలో హబ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని ఆయన వెల్లడించారు.
ఢిల్లీలో ఉన్నట్లుగా విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనకు అమెరికా కాన్సుల్ జనరల్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. విశాఖలో ఇంక్యుబేటర్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్న సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. అమెరికా – ఆంధ్ర మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా కాన్సుల్ జనరల్ చొరవ చూపాలని ఆయన కోరారు.
ఆంగ్ల భాష ప్రాధాన్యం గుర్తించామని, అందువల్లనే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియమ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి అమెరికా కాన్సులేట్ ప్రతినిధులకు చెప్పారు. రాష్ట్రంలో 98 శాతం స్కూళ్లు ఆంగ్లంలో బోధిస్తున్నాయని, టీచర్లకు ఆంగ్ల భాషలో శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నామని కూడా అన్నారు.
స్మార్ట్ సిటీగా విశాఖ ఎదగడంలో అమెరికా సహకరించాలని కోరారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో తెలుగువారు రాణిస్తున్నారని, ఆ దేశ అభివృద్ధిలో తెలుగువారు కీలక పాత్ర పోషిస్తుండం సంతోషదాయకమని ముఖ్యమంత్రి అన్నారు.
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన రాష్ట్రమని, విశాలమైన సముద్ర తీర ప్రాంతం అందుకు ఎంతో దోహదకారిగా నిలుస్తోందని, నౌకాశ్రయాల నిర్మాణంతో ఆర్ధికాభివృద్ధి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కాన్సుల్ జనరల్ చొరవ చూపాలని ఆయన కోరారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రగతి కి అమెరికా సహకరించాలన్నారు.
Must Read ;- ఈ ముఖ్యమంత్రి మనిషేనా ? : చంద్రబాబు