స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఒకే లుక్ విడుదలైంది. సినిమా విడుదల తేదీ ఆగస్టు 13 కాబట్టి దశల వారీగా అప్ డేట్స్ రావచ్చు. కాకపోతే ఈ నెల 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు కాబట్టి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
పుష్ప సినిమా టీజర్, గ్లింప్స్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బన్నీ అభిమానులకు మంచి విందు భోజనంలా ఈ అప్ డేట్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందే అంటే ఏడో తేదీ సాయంత్రం 06. 12 గంటలకు పుష్ప పాత్రను పరిచయం బోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రీల్యూడ్ వీడియోను ఈరోజు విడుదల చేశారు. అటవీ ప్రాంతంలో ముఖానికి ముసుగేసుకున్న పుష్పరాజ్ పరుగెట్టే సన్నివేశమిది. అతని చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ పరుగెట్టే వ్యక్తే అల్లు అర్జున్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కాకపోతే ఆ మొహాన్ని ఏడో తేదీ సాయంత్రం రివీల్ చేస్తారన్న మాట.
ఆర్య సిరీస్ తర్వాత ఇప్పటిదాకా బన్నీ, సుక్కు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి సంయుక్త భాగస్వామ్యంలో ఈ సినిమా నిర్మిస్తున్నాయి. ఇందులో విలన్ గా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read:అల్లు అర్జున్ మెచ్చిన ‘జాతిరత్నాలు’