ఓటీటీలో అమెజాన్ హవానే కొనసాగుతోంది. కరోనాలోనూ, కరోనా ప్రభావం తగ్గాక కూడా జనాదరణ పొందే కంటెంట్ ను అందించడంలో అమెజాన్ అగ్రస్థానంలో ఉంది. తన పోటీని ఇచ్చే ఇతర ఓటీటీ సంస్థలు, ప్రాంతీయ సంస్థల కన్నా అమెజాన్ ఒక అడుగు ముందే ఉంటోంది. ఇటీవల మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ని కూడా అమెజాన్ డైరెక్ట్ గా విడుదల చేసింది. దాంతో దీని వీక్షకుల సంఖ్య బాగా పెరిగింది. ఓటీటీలో ఇది బ్లాక్ బస్టర్ విజయంగా చెప్పుకోవచ్చు.
జనవరి నెలలో ‘తాండవ్’ విడుదలైనా అది కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. దాంతో ఆ వివాదాస్పద అంశాలను తొలగించి విడుదల చేయాల్సి వచ్చింది. చివరికి ఆ వెబ్ సిరీస్ లో కొన్ని మార్పులు చేసి విడుదల చేశారు. అంతే కాదు థియేటర్లలో విడుదలైన ‘మాస్టర్’ చిత్రాన్ని 16 రోజుల్లోనే అమెజాన్ స్ట్రీమింగ్ చేసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ ఫిబ్రవరిలో ప్రారంభం కావలసి ఉన్నా అది వాయిదా పడింది. ఆ లోటును దృశ్యం 2 భర్తీ చేసింది. ఈ విషయంలో ఇతర ఓటీటీ సంస్థలు అమెజాన్ కన్నా చాలా వెనకబడే ఉన్నాయని చెప్పవచ్చు.
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, సోనీలైవ్ లాంటి ఏ ప్లాట్‌ఫామ్ ను తీసుకున్నా అమెజాన్ ప్రైమ్ లా ఆకర్షించే కంటెంట్ ను ఈ రెండు నెలల్లో అందించలేకపోయాయి. తన ప్రత్యర్థిని సవాలు చేయడానికి నెట్ ఫ్లిక్స్ రెడీ అవుతోంది. పరిణీతి చోప్రా‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ ఫిబ్రవరి 26 న విడుదల కానుంది. మరోవైపు సోనీలైవ్ ‘గర్ల్స్ హాస్టల్’ రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించింది. ఎన్ని వచ్చినా అమెజాన్ ఆధిపత్యం మాత్రం తగ్గడం లేదు. రాబోయే కాలంలో ఈ పోటీ ఎలా ఉండబోతోందో చూడాలి.
Must Read ;- వివాదాల సుడిగుండంలో సయీఫ్ అలీఖాన్ ‘తాండవ్’