దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పిల్లలు నిజంగానే రాజకీయ వ్యూహ రచనలో గుండు సున్నాలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. వైఎస్సార్ కుమారుడు తన పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచించాలంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఆశ్రయిస్తే.. ఇప్పుడు వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల.. అదే ప్రశాంత్ కిశోర్ వద్ద శిష్యరికం చేసిన ప్రియ అనే తమిళనాడు యువతిని తనకు రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం షర్మిల ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన ప్రియ.. లోటస్ పాండ్ లో ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
డీఎంకే ఎమ్మెల్యే కూతురు ప్రియ
ప్రియకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలియవు గానీ.. ఆమె తమిళనాడుకు చెందిన ఓ మీడియా సంస్థను నడుపుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురుగా కూడా తెలుస్తోంది. 2014లో మోదీకి అధికారం దక్కే దిశగా తనదైన శైలి వ్యూహాలు అమలు చేసిన ప్రశాంత్ కిశోర్ బృందంలో ప్రియ కూడా పనిచేసింది. ప్రస్తుతం పని ఎక్కువ కావడంతో ప్రశాంత్ కిశోర్ శిష్యులు ఎక్కడికక్కడ తమ సొంత కార్యాలయాలు ఓపెన్ చేసుకుని సొంతంగానే ఆయా పార్టీలకు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.
పీకే సూచనతోనే ఈ ఎంపికా?
ఈ నెల 8న కొత్తగా యువశక్తి, రైతు రాజ్యం పార్టీ పేరిట పార్టీని ప్రకటించబోతున్న వైఎస్ షర్మిల… తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలి దూకుడు ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో తన వ్యూహాలకు మరింత పదును పెట్టే ప్లాన్లు కావాలి కదా. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ తోనే టచ్ లోకి వెళ్లిన షర్మిల… ప్రియను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ కు ప్రశాంత్ కిశోర్ ఎలాగైతే కలిసోచ్చారో… పీకే శిష్యురాలైన ప్రియ కూడా తనకు కలిసివచ్చే అవకాశాలున్నట్లుగా షర్మిల ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మరి ప్రియ వ్యూహాలు షర్మిలకు ఏ మేర ఉపయోగపడతాయో చూడాలి.
Must Read ;- దీదీ ఫార్ములాతో బీజేపీతో ఢీ.. పీకే కొత్త వ్యూహం