ఏపీలో జగన్ పాలన తీరుపై ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కారు దుర్మార్గాలపై ప్రశ్నించడమే ఆలస్యం.. దాడులు మొదలైపోతున్నాయన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన ఓ ఫిర్యాదు జగన్ జమానా తీరేంటో సవివరంగా చెప్పేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఫిర్యాదు ఏ పోలీస్ స్టేషన్ లోనో, లేదంటే ఓ కోర్టులోనో.. దాఖలైనది కాదు. సాక్షాత్తు దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కే ఈ ఫిర్యాదు వెళ్లింది. రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు కూడా వెళ్లిన ఈ ఫిర్యాదు ఇప్పుడు కలకలం రేకెత్తిస్తోంది.
ప్రశ్నిస్తే దాడులేనా?
జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ ప్రవాసాంధ్రుడు ఈ ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన బొద్దులూరి యశస్వి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అయితే సొంతగడ్డకు సంబంధించిన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్ అవడంతో పాటు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. యూట్యూబ్ లో ఆయన వీడియోలు వదులుతున్నారు. ఈ క్రమంలో మాచర్లలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, హింసాకాండపై తన యూట్యూబ్ చానల్ ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసినంతనే ఆయనపై కక్షగట్టిన ఏపీ ప్రభుత్వం నేరుగా పోలీసులనే రంగంలోకి దించిందట. ఏపీ పోలీసులతో పాటు వైసీపీకి చెందినట్లుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు హైదరాబాద్ లో ఉంటున్న తన తల్లి, సోదరులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడే యత్నం చేస్తున్నారట.
ఫిర్యాదులోని అంశాలేంటంటే..
ఈ విషయంపై సమగ్ర సమాచారంతో యశస్వి.. నేరుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులో యశస్వి ఏమని పేర్కొన్నారంటే.. ‘‘గుంటూరు జిల్లా మాచర్లలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, హింసాకాండపై యూట్యూబ్ చానల్ ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నందుకు సహించలేని కొందరు గూండాలు హైదరాబాద్‌లో నా తల్లి, సోదరుడు నివసిస్తున్న ఫ్లాట్‌పై దాడి చేశారు. అంతేకాక, మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో జూన్ 18న నాపై కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. జూన్ 22 నుంచి 24వ తేదీ మధ్యలో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో నా కుటుంబ సభ్యులు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్ద గూండాల్లా ఉన్న నలుగురు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. 25న మళ్లీ అక్కడికి వచ్చి ఫ్లాట్ తలుపుల్ని బలంగా తన్నారు. నా తల్లి, సోదరుడి ఆధార్ నంబరు, ఇతర వివరాలు ఇవ్వాలని అపార్ట్‌మెంట్ కార్యదర్శిని బెదిరించారు. నేను రాజేంద్రనగర్ పోలీసులకు ఫోన్ చేస్తే మాచర్ల నుంచి ఇద్దరు పోలీసులు వచ్చినట్టు చెప్పారు. ఆ పోలీసులు, గూండాలు కలిసి అపార్ట్‌మెంట్ వద్దనున్న సీసీటీవీ ఫుటేజీని కూడా తీసుకెళ్లారు. వారి నుంచి నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. వారికి రక్షణ కల్పించండి. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు’’అని యశస్వి ఆ పిర్యాదులో పేర్కొన్నారు.
Must Read ;- జగన్, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, జోగి.. ఇప్పుడు జక్కంపూడి











