సినీ ఇండస్ట్రీలో ఒకోసారి ప్రెస్టేజ్ నిలుపుకోవడానికి .. కొన్ని సందర్భాల్లో కొన్ని వాగ్దానాలు చేయాల్సి వస్తుంది. వాటి వల్ల లాభపడితే పర్వాలేదు. నష్టం వస్తేనే కాస్తంత కష్టం. అలా.. మాట వరసకి అన్న మాట ఓ ప్రముఖ నిర్మాతకు తీవ్రమైన నష్టం కలిగించింది. ఆయనెవరో కాదండీ.. ప్రముఖ నిర్మాత, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు. ఆయన ఎంతో మంది దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఎందరో నటీనటుల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎందరో టెక్నీషియన్స్ కీ కెరీర్ భిక్ష పెట్టారు. మరి అలాంటి రామానాయుడికి తీవ్రమైన నఫ్టం కలిగించిన మాటేంటి? దాని కథాకమామిషు ఏంటో చూద్దాం…
సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ నటించిన సూపర్ హిట్ చిత్రం సెక్రటరీ. రాఘవేంద్రరావు తండ్రి కె.యస్. ప్రకాశరావు ఆ సినిమాకి దర్శకుడు. ఆ సినిమా వందరోజుల వేడుకలో కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘రామానాయుడి బ్యానర్ లో నాలాంటి నటుడు హీరోగా నటించినా సూపర్ హిట్ అవుతుంది’ అని అన్నారు. వెంటనే రామానాయుడు ‘మీకు హీరో అవ్వాలనుంటే.. చెప్పండి.. తప్పకుండా సినిమా తీస్తాను’ అని పుసుక్కున మాటనేశారట. ఆ సంగతి రామానాయుడు మరిచిపోయినా.. సత్యనారాయణ మాత్రం మరిచిపోలేదట. పైపెచ్చు.. ఓ ప్రెస్ మీట్లో తాను రామానాయుడి బ్యానర్ లో హీరోగా నటిస్తున్నాని ప్రకటించేశారట.
ఇదిలా ఉంటే.. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బోయిన సుబ్బారావును దర్శకుడిగా పరిచయం చేస్తూ రామానాయుడు నిర్మించిన మరో హిట్ చిత్రం సావాసగాళ్లు. కృష్ణ, జయచిత్ర జంటగా నటించిన ఈ సినిమా లో తమిళ కమెడియన్ నగేష్ ప్రధాన పాత్ర పోషించారు. అలాంటి ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు .. కొత్త వాడైన బోయిన సుబ్బారావుకి నగేశ్ సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారట. దాంతో రామానాయుడు ‘కొత్త కుర్రవాడ్ని కంగారు పెట్టవద్దు. మీకు దర్శకత్వం చేయాలని కోరికగా ఉంటే చెప్పండి.. మా బ్యానర్ లో అవకాశమిస్తాను’ అని … అక్కడా మాటవరుసకి అన్నారట. రామానాయుడి మాటల్ని నగేశ్ కూడా సీరియస్ గా తీసుకొని ఓ కథ వినిపించి.. దర్శకత్వం ఛాన్స్ ఇమ్మన్నారట.
ఒక పక్క సత్యనారాయణతో హీరో ఛాన్సిస్తానని, మరో పక్క నగేశ్ తో దర్శకత్వం ఛాన్సిస్తానని మాటవరుసకి అన్న రామానాయుడు .. తన మాట నిలుపుకోడానికి ‘మొరటోడు’ అనే సినిమా నిర్మించారు. సత్యనారాయణ హీరోగా నటించిన సినిమాల్లో ఇదొక్కటన్నమాట. అయితే కథాకథనాలు నచ్చకనో , లేక సత్యనారాయణ ను హీరోగా జనాలు చూడలేకనో .. తెలియదు కానీ .,. సినిమా మాత్రం ఘోర పరాజయం పాలైంది. నష్టాల లెక్కన తేలిన తర్వాత ఇద్దరికీ ఇచ్చిన మాట ఖరీదు అక్షరాల 5 లక్షలు అని రామానాయుడు చమత్కారంగా చెప్పేవారు.
Must Read ;- ‘మాయాబజార్’ సినిమా అంటే జంధ్యాలకి అంతిష్టం మరి!











