Vijay Rupani Resigns As Gujarat CM :
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఇటీవలి కాలంలో ప్రజల్లో బాగానే వ్యతిరేకత పెరుగుతోంది. కరోనాను సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోవడం, ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం, ఆర్థిక వనరుల కోసమంటూ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ సాగుతుండటం.. ఇలా చాలా అంశాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. మరో రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు సార్లు రికార్డు విక్టరీ కొట్టిన బీజేపీ.. హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేస్తుందా? లేదంటే ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోతుందా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీకి సంబంధించి శనివారం నాడు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. ఈ పరిణామం బీజేపీలో పెను ప్రకంపనలే సృష్టిస్తోంది.
రూపానీ చేతికి సీఎం పగ్గాలు..
కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పాలనను చేజిక్కించుకంటూ వస్తోంది. ఎన్నికల్లో గెలుపు, లేదంటే.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగేయడం.. ఇలా ఏదో ఒక మాదిరిగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తోంది. ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీకి గుజరాత్ పెట్టని కోటేనని చెప్పాలి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు నరేంద్ర మోదీ వరుసగా మూడు సార్లు పార్టీని గెలిపించారు. 15 ఏళ్లకు పైగా ఆ రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ప్రధాని పదవి చేపట్టాక.. గుజరాత్ సీఎంగా తాను ఖాళీ చేసిన స్థానంలో ఆనందీ బెన్ పటేల్ ను నియమించారు. అయితే ఎక్కువ కాలం ఆ పదవిలో కూర్చోలేకపోయారు. ఆనందీబెన్ ను మార్చే సమయంలో అసలు గుజరాత్ సీఎంగా ఎవరిని నియమించాలన్న దిశగా బీజేపీ అధిష్ఠానం కుస్తీ పట్టే పట్టింది. చివరికి మిస్టర్ క్లీన్ గా పేరున్న విజయ్ రూపానీని ఆ పదవి వరించింది. మరో ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేయడం నిజంగానే కలకలం రేపేదే కదా. తన రాజీనామాకు గల కారణాలను రూపానీ వెల్లడించలేదు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించానని, మోదీ మార్గదర్శకత్వంలోనే పనిచేశానని మాత్రమే వెల్లడించారు.
వరుసగా నాలుగో సీఎం..
ఇదిలా ఉంటే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నెలల వ్యవధిలోనే ఏకంగా మూడు రాష్ట్రాల సీఎంలు రాజీనామాలు చేశారు. అందులో దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కూడా ఉంది. ఇక ఉత్తరాఖండ్ లో అయితే ఏకంగా రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు సీఎంలు తమ పదవులకు రాజీనామా చేయగా.. సీఎం కుర్చీపై ముగ్గురు నేతలు మారిపోయారు. తాజాగా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా సీఎం తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. తాజాగా విజయ్ రూపానీ గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసేశారు. వరుసబెట్టి ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ కీలక నేతలే సీఎం పదవులకు రాజీనామాలు చేస్తుండటం చూస్తుంటే.. పార్టీలో పరిస్థితి ఏమంత కుదురుగా లేదన్న వాదనలు అంతకంతకూ పెరగుతున్నాయి.
Must Read ;- వాళ్లు పిలిచారా?.. ఈయనే వెళుతున్నారా?