వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి మంగళవారం భారీ షాక్ తగిలింది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఈడీ కేసుల విచారణ కంటే ముందుగా సీబీఐ కేసుల విచారణ జరపాలన్న సాయిరెడ్డి వాదనకు తెలంగాణ హైకోర్టు ససేమిరా అన్నది. ఈ దిశగా సాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ముందుగా ఈడీ కేసుల విచారణనే కొనసాగించాలన్న నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో జారీ చేసిన తీర్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో ఈడీ కేసుల విచారణే ముందుగా జరగనున్నది. మొత్తంగా ఇటు సాయిరెడ్డితో పాటు జగన్ కు కూడా తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చిందనే చెప్పాలి.
సాయిరెడ్డి భయమేమిటంటే..?
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసిందంటే పక్కా ఆధారాలున్నాయనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈడీ నమోదు చేసిన కేసులు, వాటి విచారణలను పరిశీలిస్తే ఇదే విషయం బోధపడుతోంది. అందుకే కాబోలు.. ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ ముందుగా జరిగితే.. తమ తప్పు నిరూపితమై తక్షణమే జైలుకు వెళ్లక తప్పదని సాయిరెడ్డి ఆందోళన చెందుతున్నట్లుగా సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సీబీఐ నమోదు చేసిన కేసులపై తొలుత విచారణ జరిగితే.. ఎలాగోలా ఆ కేసుల నుంచి బయటపడి.. ఆ తర్వాత ఈడీ విచారణలు జరిగినా.. సీబీఐ కేసుల్లో క్లీన్ చిట్ వచ్చిందన్న కారణం చూపి తప్పించుకోవచ్చన్నది సాయిరెడ్డి భావనగా తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సాయిరెడ్డి రెండో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆది నుంచి జగన్ కు ఆడిటర్ గా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి.. వైఎస్సార్ జమానాలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకున్నారంటూ జగన్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై తొలుత సీబీఐ కేసు నమోదు చేయగా.. భారీ అక్రమార్జనతో కూడుకున్న ఈ కేసు వ్యవహారంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. సీబీఐ చేసిన ఆరోపణలతోనే ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
ముందుగా ఈడీ కేసుల విచారణ
ప్రస్తుతం ఇటు సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఈడీ కేసుల విచారణలు కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. పలు సాంకేతిక కారణాలను చూపుతూ నిందితులు ఆయా కేసుల విచారణలను వాయిదా వేయిస్తూ సాగుతున్నారన్న వాదనలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలోనే తాను నమోదు చేసిన కేసుల కంటే ముందుగా ఈడీ నమోదు చేసిన కేసుల విచారణను చేపట్టాలని సీబీఐ భావించింది. ఈ మేరకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. అయితే ఈడీ కేసుల కంటే ముందుగా సీబీఐ కేసులనే విచారించాలని జగన్ అండ్ కో వాదించింది. ఈ వాదలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు.. ఈడీ కేసుల విచారణలనే ముందుగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సాయిరెడ్డి తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే తెలంగాణ హైకోర్టు కూడా సీబీఐ కోర్టు జారీ చేసిన ఆదేశాలనే కొనసాగించాలని.. ముందుగా ఈడీ కేసుల విచారణనే చేపట్టాలని తీర్పు చెప్పింది. వెరసి సాయిరెడ్డితో పాటు ఇదే వాదనను వినిపించిన జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.
Must Read ;- జగన్ కేసులపై సుప్రీంలో ప్రత్యేక ధర్మాసనం