బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్-భారత్ మధ్య జరుగుతున్న టెస్టులో జాత్యహంకారం వెలుగుచూసింది. టీమిండియా ఆటగాళ్లు సిరాజ్, బుమ్రాలపై ఆసీస్ అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ.. ఆదినుంచి వివాదాల్లోకి ఎక్కుతోంది. భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఓ వార్త వైరల్ అవుతూనే ఉంది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలతో విసుగు తెప్పించిన విషయం విదితమే! అది మరువకముందే ఆదివారం మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. స్టేడియంలో ఆసీస్ అభిమానుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసీస్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత తాజా, మాజీ క్రికెటర్లు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు.
మరోసారి చేదు అనుభవం..
ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఆదివారం మరోసారి చేదు అనుభవం ఎదురైంది. శనివారం మూడో రోజు ఆటలో భాగంగా సిరాజ్, బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా బీసీసీఐని క్షమాపణ కోరింది. మరోవైపు ఐసీసీ కూడా దీనిని సీరియస్‌గా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇదంతా జరిగి ఒకరోజు గడవక ముందే మరోసారి సిరాజ్‌పై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
ఆ వ్యాఖ్యలతో నిలిచిన ఆట…
నాలుగోరోజు ఆటలో భాగంగా రెండో సెషన్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కొందరు ‘బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ’ అంటూ కామెంట్ చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లను ఆశ్రయించి మరోసారి ఫిర్యాదు చేశాడు. సిరాజ్‌తోపాటు కెప్టెన్ రహానే ఫిర్యాదుతో కాసేపు చర్చించుకున్న అంపైర్లు ఆటను నిలిపివేసి పోలీసులను రంగంలోకి దింపారు. తనపై కామెంట్ చేసిన వారిని సిరాజ్ గుర్తించాడు. వెంటనే పోలీసులు వాళ్లను స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్మెంట్‌కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
Must Read ;- డ్రాతో భారత్‌కు దక్కిన ఊరట.. ఆ ఇద్దరి పుణ్యమే!
మంకీగేట్ వివాదం గుర్తుకొచ్చింది…
సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా అభిమానులు సిడ్నీఅభిమానులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ మైదానంలో ఆసీస్ మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ , టీమిండియా వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదం అంత తేలిగ్గా ఎవరు మరిచిపోలేరు. అప్పటి టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ మంకీగేట్ వివాదంగా క్రికెట్ చరిత్రలో పెను సంచలనం రేపింది.
అంపైర్ పైనా అసభ్య పదజాలం…
ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌కు జరిమానా విధిస్తూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ నిర్ణయం తీసుకుంది. మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ సమయంలో అంపైర్‌పై అభ్యంతరకర కామెంట్ చేసినందుకే పైన్‌కు ఈ ఫైన్ వేశారు. 56వ ఓవర్లో పుజారా అవుట్ కోసం ఆసీస్ జట్టు అప్పీల్ చేసింది. ఈ సమయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ పాల్ విల్సన్ స్పందించలేదు. దీంతో పైన్.. డీఆర్‌ఎస్ రివ్యూ కోరాడు. అయినా అంపైర్ నిర్ణయం మారలేదు. దీంతో ఓ అసభ్య పదం వాడుతూ అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు పైన్. ఈ కామెంట్లు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. ఈ ఆడియో వైరల్ అవడంతో ఐసీసీ ఎలైంట్ ప్యానెల్ దీనిపై విచారణ జరిపింది. ఆ సమయంలో తన తప్పును పైన్ అంగీకరించాడు. దీంతో పైన్ మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించాలని ఎలైట్ ప్యానెల్ నిర్ణయించింది. అలాగే పైన్ కెరీర్‌లో ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చుతున్నట్లు ప్రకటించింది.
Also Read ;- ఐపీఎల్ 2021వేలమెప్పుడు? ముంబయి టీంలో మార్పులేంటి?
క్రికెట్‌కే పరిమితం కాదు..
జాత్యహంకార వ్యాఖ్యలు క్రికెట్ కే పరిమితం కాదు. గతంలో మిగిలిన క్రీడల్లోనూ ఇటువంటి సందర్భాలు ఉన్నాయని పలువురు క్రీడాకారులు పేర్కొన్నారు. హాకీ క్రీడాకారుడు వసుదేవన్ భాస్కరన్, బాక్సర్ సరితా దేవి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కూడా ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నట్లు గతంలో తెలిపారు. ఇవేకాదు బస్సులు, ట్రైన్‌లలో ప్రయాణించేటప్పుడు చాలా మంది తమపై వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశారని, దూషించారని ఫిర్యాదులు నమోదయ్యాయి.
అసలైన రౌడీ ప్రవర్తన: కోహ్లీ
ఆసీస్ అభిమానుల జాత్యహంకార వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యాడు. “జాత్యహంకార వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివి. మైదానంలో ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. మళ్లీ గ్రౌండ్‌లో వాటిని చూడడం విచారకరం. ఇది అసలుసిసలైన రౌడీ ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తోంది” అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ఘటనపై విచారణ జరపాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఆసీస్ తీరుపై సెహ్వాగ్ సీరియస్..
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. “మీరు చేస్తే వెటకారం.. అవతలి వాళ్లు చేస్తే జాత్యాహంకారం. సిడ్నీలో కొంతమంది ఆస్ట్రేలియా అభిమానులు తీరు దారుణంగా ఉంది. మంచి టెస్ట్ సిరీస్‌ను పాడు చేస్తున్నారు” అని వీరూ ట్వీట్ చేశాడు.
ఒకటే వేదిక.. పదే పదే!
సిడ్నీ వేదకగా గతంలోనూ ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. “నేను ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఇది నాలుగోసారి. ముఖ్యంగా సిడ్నీ వేదికగా గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఎంతోమంది ఆటగాళ్లు వీక్షకుల వల్ల ఇబ్బందికి గురయ్యారు. ప్లేయర్లని కవ్వించేవారు, దూషించేవారు. దానికి ప్రతిచర్యగా కొందరు ఆటగాళ్లు కూడా సమాధానమిచ్చారు. అయితే ఈసారి కొందరు ప్రేక్షకులు హద్దులు దాటి జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నారు’” అని అశ్విన్ తెలిపాడు.
Also Read ;- హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ.. ప్లస్సా.. మైనస్సా?