ఏపీ అప్పులపై దృష్టి సారించాలని నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఏపీఎండీసీ ద్వారా ఇప్పటికే రూ.10,000 కోట్ల రుణాలు తెచ్చారని, ఈ నెలలో మరో రూ.3000 కోట్లు రుణాలు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ప్రధానికి రాసిన లేఖలో వివరించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నారని ఎంపీ రఘురామరాజు ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. విశాఖలో ప్రభుత్వ భూములను దుబాయ్‌కు చెందిన లులూ కంపెనీకి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన లేఖలో వివరించారు.
ప్రజల ఆస్తులు కాపాడండి
ప్రజల ఆస్తులు కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉందని వైసీపీ ఎంపీ రఘురామరాజు ప్రధానికి రాసిన లేఖలో గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కలుగ జేసుకుని ఏపీ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై నిఘా పెట్టాలని ఆయన ప్రధానికి విజ్ఙప్తి చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా తయారైందని, ప్రతి నెలా అప్పులు చేయకపోతే కనీసం జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి కొందరికి పప్పుబెల్లాల్లా పంచడం వల్ల ఏపీ ప్రజలు నిండా అప్పుల్లో మునిగిపోయే ప్రమాదం ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ కలుగజేసుకోవాలని ఎంపీ రఘురామరాజు లేఖలో కోరారు.
Must Read ;- ప్రధాని, గవర్నర్‌లకు ఎంపీ రఘురామరాజు లేఖలు..











