ఏపీ సర్కారుకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. అప్పులపై పరిమితి పెట్టడంతో పాటు ఆంక్షలు కూడా విధించింది. ఈ పరిణామాలతో ఏపీ సర్కారు ఆదాయం పెంచుకోవడం తప్పనిసరిగా మారింది. ఖర్చులకు తగినట్టుగా సంపద సృష్టి లేకుండా కేవలం పన్నుల వసూళ్లు, అప్పులపై ఆధార పడి సంక్షేమ పథకాల అమలు చేసే విధానాలను మార్చుకోక తప్పని పరిస్థితి కల్పించింది. ఏపీ సర్కారు చేస్తున్న అప్పుల విషయంలో ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు, ఏజన్సీలు హెచ్చరికలు జారీ చేయగా కాగ్ కూడా ప్రత్యేకంగా ఈ సూచనలు చేసింది. ఆదాయ మార్గాలు లేకుండా పరిమితి లేని సంక్షేమ కార్యక్రమాల అమలుపై పరోక్షంగా హెచ్చరికలూ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తన అస్త్రాన్ని ఏపీ సర్కారుపై వదిలింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితిని నిర్దేశిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు పేజీల లేఖ పంపడం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 4శాతం మాత్రమే నికర రుణం
కేంద్రం విధించిన పరిమితి గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఏదేని ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 4శాతం మేర మాత్రమే నికర రుణంగా ఉండాలని ఆర్థిక సంఘం సూచించింది. దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం రుణం నుంచి తిరిగి చెల్లించిన అప్పును మినహాయించాక ఈ నికర రుణ పరిమితి వర్తిస్తుంది. ఏపీలో స్థూల జాతీయోత్పత్తి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 10 లక్షల 61 వేల 802 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆ ప్రకారం చూస్తే రాష్ట్రానికి రూ.42,472కోట్ల నికర పరిమితి వర్తిస్తుంది. ఇంతకు మించి అప్పులు చేయడానికి వీల్లేదని తేల్చింది. ఇక్కడే మరో 2 నిబంధనలు పెట్టింది. ఒకటో నిబంధన ప్రకారం.. ఈ అప్పులో ప్రైవేటు సంస్థలు, నాబార్డు లాంటి సంస్థలు, పీఎఫ్, చిన్నమొత్తాలు, బాండ్లు అన్నీ కలిసే ఉంటాయి. అంటే ఏ రూపంలో అప్పు తీసుకున్నా..ఈ పరిమితి వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక రెండో నిబంధన ప్రకారం.. ఏపీకి ఉన్న అప్పుల పరిమితి రూ.42,472 కోట్లలో కచ్చితంగా రూ. 27, 589 పెట్టుబడి వ్యయం చేయాలని కేంద్రం తేల్చేసింది. అంటే పునరుత్పాదక రంగాలపై ఆ పెట్టుబడులు ఉండాని సూచించింది. అంటే రాష్ట్రానికి దాదాపు రూ.15వేల కోట్ల నిధులు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో వచ్చే ఆదాయంపైనే రాష్ట్రాలు ఆశలు పెట్టుకోక తప్పని పరిస్థితిని ఈ పరిమితులు చెబుతున్నాయి.
పరిమితికి మించి..
కాగా ఏపీ ప్రభుత్వ అప్పు ఇప్పటికే దాదాపు 4లక్షల కోట్లకు చేరింది. 2020 చివరి నాటికి రూ.3.73లక్షల కోట్లకు చేరింది. 2020 ఏప్రిల్ – నవంబర్ మధ్య కాలంలో తీసుకున్న రుణమే దాదాపు రూ.73వేల కోట్లుగా ఉండడంపై ఆర్థిక సంస్థలు కూడా ఒకింత షాక్‌నకు గురయ్యాయని చెప్పవచ్చు. ఏపీలో సంక్షేమ పాలన ట్యాగ్‌తో నిధులు ఖర్చుచేస్తున్నా..అప్పుల విషయం ఏంటనే ప్రశ్నలూ తలెత్తాయి. ఆదాయ మార్గాలు పెంచుకోకుండా సంక్షేమ పథకాలకే సింహభాగం ఖర్చు చేయడంపై ఆక్షేపించాయి.
పరిమితిపై కోత విధించేలా..
ఇక ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం.. పెట్టుబడి వ్యయం నిర్ణీత మొత్తంలో లేని పక్షంగా నికర రుణ పరిమితిలో కోత విధించేందుకు కూడా ఆర్థిక సంఘం సిఫారసులు చేసింది. కేంద్రం కూడా అందుకు సిద్ధమైంది. 2021-22లో పెట్టుబడి వ్యయం రూ.27,589 కోట్లు లేని పక్షంలో జీడీపీలో 0.50 శాతం అంటే రూ. 5 వేల కోట్లకుపైగా కోత పడనుంది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి అంశాల వారీగా తీసుకున్న రుణాలు, రుణాల తిరిగి చెల్లింపు, నికర రుణం, రాష్ట్రంలోని విద్యుత్తు డిస్కంల నష్టాలు, రాష్ట్ర వాటా, ఇతర రుణాలు, నిధుల సర్దుబాట్లు తదితర అంశాలపై రెండు రకాల నివేదికలను ఏప్రిల్ నెలాఖరులోగా ఇవ్వాలని కూడా సూచించింది.
Must Read ;- తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్