రైతు భరోసా. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం. ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్సీపీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఏటా రూ.12వేలు ఖాతాలో జమ చేస్తామని ప్రచారం చేశారు. మరి నేడు రూ.13,500 ఇస్తున్నారుగా ఇబ్బంది ఏమిటని అనుమానం రావొచ్చు. కానీ ఈ మొత్తంలో రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా రైతుల ఖాతాలో వేస్తోంది. ఈ మొత్తం కలిపి ఏపీ ప్రభుత్వం మరో రూ.7500 రైతుల ఖాతాలో మూడు దఫాలుగా జమ చేస్తోంది. అంటే వైఎస్సార్సీపీ అధినేత ఇచ్చిన హామీలో ఒక్కో రైతుకు రూ.4500 కోత వేశారన్నమాట. ఇంత వరకూ బాగానే ఉన్నా ఏపీలో రైతుల సంఖ్యను సగానికి తగ్గించారు. కోటి మంది రైతుల్లో కేవలం 50 లక్షల మందికే రైతు భరోసా సాయం అందుతోంది. కొత్తగా రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నా సాధ్యం కావడం లేదు. ఇక ఏపీలో 30 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అందని ద్రాక్షలా మారింది.
కౌలురైతుకేదీ భరోసా..
రైతు భరోసా సాయం విషయంలో ఏపీ ప్రభుత్వం చక్కగా కోత వేసింది. వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించిన మొత్తంలో కేంద్రం ఏటా ఇచ్చే రూ.3000 కోట్లు కలిపేసుకున్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సగం ఖర్చు తగ్గింది. ఇక రైతుల సంఖ్యను కోటి నుంచి 50 లక్షలకు పరిమితం చేశారు. దీంతో మరో సగం ఖర్చు కలసివచ్చింది. ఏటా కోటి మంది రైతులకు ఏపీ ప్రభుత్వం రూ.13500 చొప్పున నగదు జమ చేయాలంటే, ఏటా రూ.13,500 కోట్ల నిధులు అవసరం అవుతాయి. కానీ రైతుల సంఖ్యను సగానికి తగ్గించడంతో రైతు భరోసా పథకం ఖర్చు రూ.6750 కోట్లకు తగ్గింది. ఈ మొత్తంలో కేంద్రం ఏటా రూ.3000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తోంది. కేంద్రం డబ్బు వేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కొంత కలిపి రైతుల ఖాతాలో జమచేస్తోంది. ఇక రైతు భరోసా పథకం మొత్తం ఏపీ ప్రభుత్వానిదే అని భారీగా ప్రచారం చేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ పథకాన్ని హైజాక్ చేశారని రైతులు విమర్శిస్తున్నారు.
మడమ తిప్పం మాట తప్పం అంటే ఇదేనా..
ఏపీలో 90 శాతం మంది చిన్న సన్నకారు రైతులే. కోటి మంది రైతులు అర ఎకరా నుంచి 5 ఎకరాలలోపు భూమిలో సాగు చేస్తున్నవారే. వైఎస్సార్సీపీ నాయకులు ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సాక్షాత్తూ వైఎస్సార్సీపీ అధినేత మానసపుత్రిక రైతు భరోసా పథకం. ఈ పథకాన్ని చాకచక్యంగా సగానికి తగ్గించారు. కోటి మంది రైతుల్లో సగం మందికి కోతవేశారు. కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతుల సమాచారంతోనే తాజాగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారు. అందుకే కొత్తగా రైతులు రైతు భరోసా పథకంలో చేరాలన్నా సాధ్యం కావడం లేదు. ఇక ఏపీలో కౌలు రైతులకు కేవలం లక్ష మందికే గుర్తింపు కార్డులు ఉన్నాయి. వారిలో కూడా సగం మందికే రైతు భరోసా దక్కుతోంది. ఇలా రైతుల సంఖ్యను సగానికి తగ్గించడం, కేంద్ర సాయాన్ని రైతు భరోసాలో కలిపేయడంతో ప్రభుత్వం ఖర్చును నాలుగోవంతుకు తగ్గించుకోగలిగారు. ఐదేళ్లలో రూ.77000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న ఏపీ ప్రభుత్వం ఏటా రూ.6000 కోట్లు విడుదల చేస్తే ఐదేళ్లలో రూ.77000 కోట్లు ఎలా అవుతాయో వారే చెప్పాలి.
ఏపీ బీజేపీ నేతలు మాట్లాడరే..
కేంద్ర ప్రభుత్వం ఏపీ రైతులకు ఏటా రూ.3000 కోట్లు ఇస్తున్నా, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ప్రచారం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. విఫలమయ్యారనడం కన్నా వైఎస్సార్సీపీతో కుమ్మక్కయారని టీడీపీ విమర్శిస్తోంది. ఏపీ బీజేపీ నేతల తీరు పరిశీలిస్తే నేటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిలా కనిపిస్తున్నారని భావించాల్సి వస్తోంది. ఎంత సేపటికీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేయడంతోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు కాలం గడిపేస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీకి తోక పార్టీగా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.










