తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మపురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలను తీరని అన్యాయం జరిగిందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. తమిళనాడుకు 11 పురస్కారాలు ప్రకటించిన కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కేవలం నాలుగు పురస్కారాలు మాత్రమే ప్రకటించింది. గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యానికి తమిళనాడు కోటాలో దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించింది. చెన్నైలో స్థిరపడ్డా, బాలసుబ్రహ్మణ్యం తెలుగువారే. తెలుగులోనే ఆయన ఎక్కువ పాటలు పాడారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆయనకు పురస్కారం దక్కితే మరింత గౌరవంగా ఉండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం పంపే సిఫారసులే కీలకంగా ఉండే మాట నిజమే కానీ.. ఆ పని మన ప్రభుత్వాలు చేయలేకపోయాయనేది పలువురి ఆవేదన.
తెలంగాణలో మరొక్కరు కూడా అర్హులు లేరా?
తెలంగాణలో ఆర్ట్స్ నుంచి కనకరాజుకు పద్మశ్రీ దక్కింది. తెలంగాణ మొత్తానికి ఒకే ఒక్కరికి మాత్రమే పద్మ పురస్కారం దక్కడంపై తెలుగు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనాభా పరగా చూసినా తెలంగాణకు 4 ఏపీకి 4 పురస్కారాలు దక్కాల్సి ఉంది. జనాభా లెక్కలు చూడడం సముచితం కాకపోవచ్చు గానీ.. ప్రతిభాపాటవాల పరంగా లెక్కవేసినా.. తెలంగాణలో రెండో వ్యక్తి కూడా పద్మ పురస్కారాలకు తగిన వారు లేరా అనేది మీమాంస.
అర్హులే లేరా?
తెలుగు రాష్ట్రాల్లో పద్మ పురస్కారాలు అందుకోవడానికి అర్హులే లేరా? అన్నవిధంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రముఖ కళాకారులు ఎన్నో ఏళ్లుగా పద్మశ్రీ కోసం వేచి చూస్తున్నారు. పద్మ పురస్కారాలు కూడా చివరకు లాబీయింగ్ చేసుకునే వారికే దక్కుతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కళాకారులు, సామాజిక కార్యకర్తలు, నిపుణులు, మేధావులు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొందరికైనా పద్మశ్రీ దక్కిఉంటే తెలుగు ప్రజలు మరింత సంతసించేవారు. అయినా అడుక్కుంటే వచ్చే పద్మశ్రీలు మాకు అక్కర లేదని చాలా మంది కళాకారులు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పురస్కారాల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసి తెచ్చుకోవడం సిగ్గుచేటు, ప్రభుత్వమే కళాకారులను, సాహితీవేత్తలను, సామాజిక కార్యకర్తలను గుర్తించి పద్మశ్రీతో సత్కరిస్తే వారు మరింత ఉత్సాహంగా సమాజ సేవ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు వికసించలేదనే చెప్పాలి.
ఎన్నికలు ఒక కారణమా?
త్వరలో తమిళనాడు ఎన్నికలు దగ్గర పడటంతో ఆ రాష్ట్రానికి 11 పద్మాలు దక్కాయనే విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. తమిళనాడులో కాలుమోపాలని.. అక్కడి స్థానిక పార్టీలతో పొత్తులకు ప్రయత్నిస్తూ.. బీజేపీ రకరకాల మాయోపాయాలు ప్రదర్శిస్తోంది. ఏకంగా ఆ రాష్ట్రానికి 11 పద్మ పురస్కారాలు కూడా ఈ వ్యూహాల్లో ఒక భాగమే అనే వాదన వినిపిస్తోంది.
Must Read ;- మరణానంతరం పద్మవిభూషణుల్లో బాలు











