ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా ఓటీటీలో దుమ్ము దులిపేస్తోంది. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తమిళంలో ఏప్రిల్ 9న విడుదలైంది. దురదృష్ట వశాత్తు కరోనా సెకండ్ వేవ్ దెబ్బ ఈ సినిమాకి కూడా పడింది. దర్శకుడు మారి సెల్వరాజ్ దీన్ని ఓ కళాఖండంగా మలిచాడు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఇటీవల రిలీజైంది. విమర్శకులంతా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఓ అణగారిన కులంలో పుట్టిన యువకుడి కథ ఇది. పందుల స్వైర విహారం, దోమల దౌర్జన్యం మధ్య పెరుగుతాడు.
పందుల పెంపకందారుడి ఇంట్లో పుడతాడు కర్ణన్. ఒకవిధంగా ఇది కర్ణుడి పాత్ర లాంటిదే. కాకపోతే అతడికి కవచకుండాలాలేమీ లేవు. కేవలం నాలుగు పాత్రలతోనే ఈ కథ సాగుతుంది. అందులో ముఖ్యమైన పాత్రలు రెండు. ఒకటి ధనుష్, ఇంకోటి లాల్ పోషించారు. వీరు ఈ పాత్రలను పోషించారు అనడం కన్నా అందులో జీవించారు అంటేనే బాగుంటుంది. దర్శకుడు తన స్వీయానుభవంతో ఈ సినిమా తీశాడా అన్న అనుభూతి చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది. చూసే ప్రేక్షకుడు కూడా ఆవేశంతో రగిలిపోతాడు.
కథలోకి వెళితే..
ఓ మారుమూల కుగ్రామంలో ఈ కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరికి కనీసం రోడ్డు కూడా ఉండదు. కట్టెల్ని కాల్చి బొగ్గు అమ్మకుని బతికే దళితుల కుటుంబాల్లోని కథ. కాలినడకన పక్క ఊరికి వెళితేనేగాని బస్సు ఎక్కడం కుదరదు. ఈ ఊరి మీదుగా బస్సు వెళ్లినా అక్కడ మాత్రం బస్సు ఆపరు. కడుపు మండిన ఓ కుర్రాడు రాయి విసిరి బస్సు అద్దం పగులగొడితేనే బస్సు ఆగుతుంది. ఇక్కడే తిరుగుబాటు కూడా ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో బస్సును ఆపేలా చేయగలిగారా అన్నదే ఈ సినిమా. ఇందులో ఉన్న గాడిదకూ కర్ణన్ కూ ఉన్న సంబంధం ఎలాంటిదో సినిమా చూస్తేనే గానీ అర్థం కాదు.
దాని కాళ్లకు బంధం ఎందుకు వేశారని ధనుష్ లాల్ ని అడుగుతాడు. దానికి లాల్ అలా బంధం వేయకపోతే అది మరో చోటుకు పారిపోతుందంటాడు. బంధం తెగితేనే తిరుగుబాటు పుడుతుందని, స్వేచ్ఛ కలుగుతుందని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. గద్దొచ్చి కోడిపిల్లను తన్నుకు పోయే సన్నివేశం కూడా మరొకటుంది. ఓ ముసలావిడ ఆ గద్దను తిడుతుంది. ఇలాంటి అనవసర సన్నివేశాన్ని దర్శకుడు ఎందుకు పెట్టాడని కూడా అనిపిస్తుంది. కానీ కథకూ దీనికి ఎలాంటి లింకు పెట్టాడో చూస్తేనేగాని అర్థంకాదు.
కులం బలుపుకు కర్ణన్ ఎలాంటి సమాధానం చెబుతాడన్నది ఇందులో ఆసక్తికరమైన అంశం. సినిమాని కాకుండా దర్వకుడు జీవితాన్ని ఇందులో చూపించాడు. చేతిలో ఆయుధం ఉంచుకుని తిరగబడితే రౌడీ అనాలా? వీరుడనాలా? అది మనమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆయుధంతోనే అణచివేత, ఆధిపత్యం ప్రారంభమవుతాయి. అనేక సమస్యల పరిష్కారానికి కూడా ఆయుధమే దారిచూపిస్తుంది. అందుకే కర్ణన్ సినిమా ఓ కళాఖండగా మిగులుతుంది. సంతోష్ నారాయణన్ నేపథ్యం సంగీతం ఓ సినిమాని మరో మెట్టు పైన నిలిపింది. కరోనా కారణంగా థియేటర్లలో ఈ సినిమాకి రాని స్పందనను ఓటీటీ భర్తీచేసేస్తోంది.
– హేమసుందర్
Must Read ;- ఓటీటీలో విడుదల కాబోతున్న మెగా హీరో రెండో సినిమా?











