తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెడితే ఊరుకునేది లేదని, జైళ్లు, పోలీసుల కేసులు తనను ఏమి చేయలేవని విజయశాంతి అన్నారు. 2012 నాటి కేసులో గురువారం మధ్యాహ్నం ఆమె నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. 2012లో మహాబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సభ పెట్టారని, అప్పుడు ఆయన మీటింగ్ పెడితే, తాను ప్రచారం మాత్రమే చేశాననన్నారు. సభకు అనుమతి ఉందా? లేదా ? అనేది పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ చూసుకోవాలని, తనపై ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు.
కేసీఆర్ పైనే కేసు పెట్టాలి
2012లో కేసు పెడితే, 2021లో విచారణకు పిలిపించడమేంటి అని, అప్పటిదాకా నిద్రపోయారా..? అని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా సభ నిర్వహించిన కేసీఆర్ పైనే కేసు పెట్టాలని, తనను ఇబ్బంది పెడితే జనం ఊరుకోరని హెచ్చరించారు. కేసీఆర్ కావాలనే ఉద్యమకారులపై కేసులు పెడుతున్నారని, దేన్ననయినా ఎదుర్కొంటానని విజయశాంతి అన్నారు.
Also Read:కేసిఆర్ పై నిప్పులు చెరిగిన విజయశాంతి