ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ అనే సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయనతో సినిమా నటుల ఆర్థిక సంబంధాలు క్షేమకరంగానే కాదు లాభదాయకంగానూ ఉంటాయి. ప్రముఖ నటుడు సుధాకర్ కు కూడా ఎడిటర్ మోహన్ తో అలాంటి అనుబంధమే ఉండేది. అదెలా జరిగిందో కూడా చూద్దాం. అదృష్టం బాగుంటే సినిమా రంగంలో రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. డబ్బు, కార్లు, బంగ్లా.. ఇలా ఒక్కటేమిటి ఏది కోరుకుంటే అది వచ్చేస్తాయి.
అసలు చెన్నైలో నటనలో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో మొదటి అవకాశం వరించింది మాత్రం సుధాకర్ నే. ఆ రూములో చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ లు ఉన్న సంగతి తెలిసిందే. అవకాశాల వేటలో ఉన్న సుధాకర్ ఓసారి భారతీరాజాను కలవడం, ఆయన సుధాకర్ కు ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదే సినిమా తెలుగులో ‘తూర్పు వెళ్లే రైలు’ అనే పేరుతో విడుదలైంది. ఇది 1977నాటి మాట. ఇందులో సుధాకర్ కు లభించిన పారితోషికం ఎంతో తెలుసా? రెండు వేల ఐదు వందల రూపాయలు. అత్యధిక పారితోషికం ‘స్నేహమంటే ఇదేరా’ సినిమాకి గాను దాదాపు రూ. 9 లక్షలు అందుకున్నారట.
సాధారణంగా సినిమా వారికి డబ్బు బాగా వస్తుంది. దాన్ని ఇన్వెస్ట్ చేయడంలోనే తప్పటడుగులు వేస్తుంటారు. ఇలాంటివారు శోభన్ బాబు లాంటి వారి సలహాల మేరకు భూముల మీద పెట్టుబడులు పెడుతుంటారు. కానీ సుధాకర్ మాత్రం అలా చేయలేదట. డబ్బు విషయంలో ఆయన అంత సీరియస్ గా ఉండేవారు కాదు. లేకుంటే ఈరోజు సుధాకర్ కొన్ని కోట్లకు అధిపతిగా ఉండేవారు. నిర్మాత ఎడిటర్ మోహన్ తో సుధాకర్ కు మంచి అనుబంధం ఉండేది. ఆయన నిర్మించిన ఎన్నో చిత్రాల్లో సుధాకర్ మంచి పాత్రలు పోషించారు. ఎడిటర్ మోహన్ తన చిత్రాలకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతే దాన్ని సుధాకర్ తీసుకునే వారు కాదట.
ఆ మొత్తాన్ని ఆయన దగ్గరే ఉంచమని చెప్పి ఎంత ఇవ్వబోయారో అంతే మొత్తాన్ని ఎడిటర్ మోహన్ చేతికి సుధాకర్ ఇచ్చేవారట. ఆ మొత్తాన్ని సినిమా పెట్టుబడిగా ఎడిటర్ మోహన్ వినియోగించే వారట. సినిమా విడుదలైనప్పుడు ఆ రెండు మొత్తాలకు కొంత మొత్తాన్ని కలిపి ఎడిటర్ మోహన్ సుధాకర్ చేతికి ఇచ్చేవారట. ఈ విషయాన్ని ఎడిటర్ మోహన్ స్వయంగా ‘లియో న్యూస్’కు చెప్పడం విశేషం. సుధాకర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అనారోగ్యం కారణంగా సుధాకర్ దాదాపు పదేళ్ల కెరీర్ ను కోల్పోయారు. అది జరగకుండా ఉండి ఉంటే సుధాకర్ జీవితం ఇంకోలా ఉండేదేమో.
Also Read:హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు











