వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన లేఖల పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా లేఖలు రాసిన రఘురామరాజు… తాజాగా శనివారం కూడా మరో లేఖ సంధించారు. ఇందులో తిరుమల ఆలయ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని నియమించడం వెనుక జగన్ సర్కారుకు దురుద్దేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. స్పెసిఫైడ్ అథారిటీ పేరిట వెంకన్న సొమ్మును దోచేసి… ఇతరత్రా కార్యకలాపాల కోసం వెచ్చించేందుకు కుట్ర జరుగుతోందని రఘురామరాజు తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
అథారిటీ ఏర్పాటులో నిబంధనలేవీ?
తాజా లేఖలో రఘురామరాజు ఏఏ అంశాలను ప్రస్తావించారన్న అంశానికి వస్తే… ‘‘తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుకి 146 జీవో విడుదల చేయడం సరికాదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై రాష్ట్ర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కేవలం ఇద్దరు సభ్యులతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తే సమగ్రంగా చర్చించేందుకు వీలు ఉండదు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగానీ, కమిషనర్ గానీ అథారిటీలో సభ్యులుగా ఉంటారు. తిరుమలలో స్పెసిఫైడ్ అథారిటీ విషయంలో అలాంటి సంప్రదాయం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది’’ అని రఘురామరాజు అనుమానాలు వ్యక్తం చేశారు.
దేవుడి సొమ్ము తరలిస్తారా?
అంతటితో ఆగని రఘురామరాజు.. ‘‘రాష్ట్రంలో ఆర్థిక లోటు నుంచి బయటపడేందుకు బాండ్లను జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ బాండ్లను కనీసంగా రూ.5 వేల కోట్ల మేర స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా కొనుగోలు చేస్తారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై సర్కారు స్పష్టత ఇవ్వాలి. వెంటనే కొత్త బోర్డును ఏర్పాటు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. మొత్తంగా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు వెనుక జగన్ సర్కారు లక్ష్యమేమిటో వివరిస్తూ రఘురామరాజు నేరుగా జగన్ కే లేఖ రాసిన వైనం సంచలనం రేకెత్తిస్తోంది.
Must Read ;- ముద్రగడ ఒకే ఒక్కమాట.. జగన్‌కు కొరడా దెబ్బ!











