బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణిస్తోందా? గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ డిసెంబరు 11వ తేదీకి దిలీప్ కుమార్ కు 98 ఏళ్లు. ఆయన కొంత బలహీనంగా ఉన్నట్లు ఆయన భార్య, ప్రముఖ నటి సైరాభాను తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. దీని మీద సైరాభాను స్పందించారు. ఆయన ఆరోగ్యం బాగుండని మాట వాస్తవమేనని, ఆయనను కాపాడుతున్న భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె వివరించారు.
దిలీప్ కుమార్ తో ఉన్న తన ఫొటోను ఆమె కొంతకాలం క్రితం మీడియాకు విడుదల చేశారు. ఆయన ట్రేడ్ మార్క్ అయిన వైట్ కుర్తా, శాలువతో కెమెరా వైపు చిరునవ్వుతో చూసే ఫోటో ఇది. 1966లో దిలీప్ కుమార్ నటి సైరాభాను వివాహం చేసుకున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో సైరాభాను అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు మీడియాకు అప్ డేట్స్ ఇస్తున్నారు. ఆయన సోదరులు ఎహ్ సాన్ ఖాన్, అస్లాం ఖాన్ లు కరోనా పాజిటివ్ తో మరణించడంతో గత అక్టోబరులో వీరు జరుపుకోవాల్సిన మ్యారేజ్ డే ఫంక్షన్ ను కూడా రద్దు చేసుకున్నారు.
అనేక కుటుంబాల్లో కోవిడ్ విషాదాన్ని మిగల్చడం పట్ల ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానని సైరా ట్వీట్ చేశారు. మన దేశంలో అత్యంత ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్న నటుల్లో దిలీప్ కుమార్ ఒకరు. 1944లో జ్వార్ భాటా సినిమాతో ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టారు. నటుడిగా ఆయన ఆఖరి సినిమా ఖిలా. 1998లో ఈ సినిమా విడుదలైంది. ఈ లెజండరీ నటుడు నిండు నూరేళ్ల జీవితాన్ని అనుభవించాలని కోరుకుందాం.
Must Read ;- సీనియర్ నటీమణి గురించి ఆవేదన వ్యక్తం చేసిన పరుచూరి