తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో మరింతగా దిగజారింది. ఒకప్పుడు రాష్ట్రంలో హస్తం హవా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత క్రమంగా రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి మునగడానికి సిద్ధంగా ఉండే నావలా తయారైంది. ఇప్పుడు ఆ నావ మునగకుండా.. దానిని ఓడ్డుకు చేర్చే కెప్టెన్ కోసం కాంగ్రెస్ అధిష్టానం వెతుకులాట ప్రారంభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేలా సమర్ధవంతమైన ఓ నాయకుడి కోసం వేట మొదలెట్టింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి పదవికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు ఈ బాధ్యతలను అధిష్టానం అప్పగించింది.
ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్కం నేడు లేదా రేపు హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీ నేతలతో ఓ సమావేశం ఏర్పాటు చేసి పీసీసీ ఎంపికపై నేతల అభిప్రాయాలను తీసుకున్న తరువాత ఎవరయితే ఆ పదవికి అర్హులో వారి పేర్లను అధిష్టానికి నివేదించనున్నారు. మాణిక్కం ఠాగూర్ సూచన మేరకు పీసీసీ ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ముందు ఎలాంటి వివాదాలు లేకుండా మెజారిటీ నేతల అభిప్రాయాలను తీసుకున్న తరువాతనే పీసీసీ ఎంపికను చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం గురువారం నుంచి రాష్ట్ర ముఖ్య నేతలతో మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు జరపనున్నారు. పీసీసీ ఎంపికపై పార్టీలో ఎలాంటి వివాదాలు, మనస్పర్థలు, పార్టీలో చీలికలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాణిక్కం ఠాగూర్‌కి అధిష్టానం తగు సూచనలు చేసింది. దీంతో పీసీసీ ఎంపికపై తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకుపోవాలని పార్టీ భావిస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నవారి పేర్లు చాలానే వినిపిస్తున్నాయి. ఈ రేసులో మేమూ కూడా అర్హులేనని కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, కొమటి రెండ్డి వెంకట్‌రెడ్డిలు ఇప్పటికే పలుమార్లు తమ మనసులోని మాటను బయటపెట్టారు. అవకాశం దొరికనప్పుడల్లా పీసీసీ పదవికి తామెందుకు అర్హులమో కూడా చెప్పుకొస్తున్నారు. పీసీసీ పదవి రేసులో ఎంపీ రేవంత్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. పీసీసీ పదవికి సరైన నేత రేవంత్ రెడ్డి అనే అభిప్రాయాన్ని కింది స్థాయి కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చే సమర్థత ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధిష్టానందే తుది నిర్ణయం తీసుకోనుంది. కోత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు? ఎవరికి అవకాశం వరించనుంది? అనేది మాత్రం అధిష్టానం చేతిలోనే ఉంది.
Must Read ;- కార్యకర్తలలో ధైర్యాన్ని నింపిన రేవంత్ రెడ్డి