మన హీరోలు హీరోయిజం చూపించుకుంటున్నారు. తెలుగు మెగాస్టార్ ప్రతి జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసి అందరి మన్ననలూ అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ కు వెళితే సల్మాన్ ఖాన్ సినీ పరిశ్రమలో పనిచేసే 25 వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1500 చొప్పున వేస్తే 25 వేలమందికి ఎంత అవుతుందో ఊహించండి. మూడు కోట్ల 75లక్షలను వీరి కోసం సల్మాన్ వెచ్చిస్తున్నారు. కన్నడ హీరో యష్ అయితే శాండల్ వుడ్ అభిమానుల మనసు కొల్లగొట్టేశాడు.
ఎందుకంటే సినీ పరిశ్రమలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న వారి బ్యాంకు ఖాతాలో ఒక్కొక్కరికి రూ. 5000 వేయనున్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు కోటిన్నర వీరి కోసం ఆయన కేటాయించారు. ఇలా హీరోలంతా స్పందిస్తే సినీ కార్మికులకు ఎంత ఊరట కలుగుతుంది. ప్రజలకు సాయం చేయకపోయినా కనీసం పరిశ్రమలో ఉంటూ తమ కోసం పాటు పడే కార్మికులను ఆదుకోవడం కంటే కావలసింది ఏముంటుంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (FWICE)ను సంప్రదించి కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలను సల్మాన్ ఖాన్ తీసుకున్నారు.
కర్ణాటకకు చెందిన ఓ యువకుడి తండ్రి కరోనాతో మరణించడంతో సాయం కోసం ట్విట్టర్ లో అతను సల్మాన్ ను సంప్రదించాడు. వెంటనే సల్మాన్ ఆ అబ్బాయికి కావలసిన ఆహార సామగ్రి అందించారు. అతని చదువు కొనసాగడానికి ఏర్పాట్లు చేశారు. సల్మాన్ ఖాన్ యువసేన లీడర్ రాహుల్ ఎస్ కనాల్ రోజూ ముంబయిలోని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి, హోం ఐసోలేషన్లో ఉన్నవాళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నారు. కన్నడ హీరో యష్ విషయానికి వస్తే మూడు వేలమందకి ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున వారి అకౌంట్ లో వేయనున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.
తను చేసే ఈ చిన్న సాయం వారి కష్టాన్ని తీర్చలేకపోయినా కొంత ఊరటను ఇస్తుందనే ఉద్ధేశంతో ఈ పని చేస్తున్నానన్నారు. సల్మాన్, యష్ లు చేస్తున్న పనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటున్న సినీ కార్మికులకు కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్, ఉపేంద్ర, శివ రాజ్ కుమార్ లాంటి వారు కూడా తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మిగతా హీరోలు కూడా స్పందించి సినీ కార్మికులను ఆదుకుంటే బాగుంటుంది.
Must Read ;- సోనూ సేవలకు సినీ జనాలు సైతం ఫిదా!











