TRS MLA T Rajaiah Meets Brother Anil Kumar :
తాడికొండ రాజయ్య.. టీఆర్ఎస్ లో కీలక నేతగానే కాకుండా తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఆ రాష్ట్రానికి తొలి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన నేత. కేసీఆర్ తొలి సర్కారులో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారాలను పర్యవేక్షించారు. అయితే ఆరు నెలలు తిరక్కుండానే ఆ పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. వైద్య, ఆరోగ్యశాఖలో వెలుగు చూసిన ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారన్న వాదనలు నాడు వినిపించాయి. అంతేకాకుండా రాజయ్య పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్.. వైద్య, ఆరోగ్య శాఖలో రాజయ్య కుటుంబ సభ్యుల జోక్యాన్ని కూడా కోపగించుకున్నారన్న విమర్శలు వినిపించాయి. ఏదైతేనేం.. తనకు ఇష్టం లేకున్నా కూడా రాజయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇటీవలే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ నకు గురైన ఈటల రాజేందర్ మాదిరే రాజయ్య కూడా పార్టీ మారతారని నాడు వార్తలు వినిపించాయి. అయితే ఎందుకనో గానీ.. ఇప్పటికీ టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్న రాజయ్య తాజాగా టీఆర్ఎస్ ను వదిలి.. వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్టీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
బ్రదర్ అనిల్ తో భేటీ
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ తో ఆదివారం నాడు రాజయ్య భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లిన రాజయ్య.. బ్రదర్ అనిల్ తో భేటీ అయ్యారని, ఆ తర్వాత ఆయన వైఎస్ షర్మిలతోనూ భేటీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బ్రదర్ అనిల్ తో కలిసి ఉన్న రాజయ్య ఫొటోలు మాత్రమే బయటకు రాగా.. షర్మిలతో రాజయ్య భేటీ అయినట్లుగా చెబుతున్న ఫొటోలు మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ తోనే రాజయ్య భేటీ అయ్యారని, వైఎస్ షర్మిలను ఆయన కలవనేలేదని వైఎస్సార్టీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో సన్నిహితంగా మెలగిన రాజయ్య.. గతంలో షర్మిలను చాలాసార్లే కలిశారని, ఇప్పుడు కూడా ఆయన బ్రదర్ అనిల్ తో కలవడం వెనుక రాజకీయ కారణాలేవీ లేవని, మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని కూడా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
టీఆర్ఎస్ ను వీడతారా?
ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ లో గతంలో కీలక నేతగా వ్యవహరించిన రాజయ్య ప్రస్తుతం అస్సలు కనిపించడమే లేదు. అంతేకాకుండా మంత్రి పదవిని వదులుకున్న తర్వాత స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కూడా ఆయనకు దక్కదని, అక్కడి నుంచి చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కడియం శ్రీహరికి ఆ టికెట్ ను కేసీఆర్ కేటాయిస్తారని కూడా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తనకు టికెట్ దక్కుతుందా? లేదా? అన్న కోణంలోనూ రాజయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారనే చెప్పాలి. కేసీఆర్ ఏమనుకున్నారో గానీ..రాజయ్యకే ఆ టికెట్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత పార్టీలో ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదు. తెలంగాణకు తొలి డిప్యూటీ సీఎంగా ఎన్నికైన రాజయ్య కేవలం ఆరు నెలలకే ఆ పదవి నుంచి దిగిపోయి.. అనంతరం అడ్రెస్ లేకుండా పోయారని చెప్పాలి. ఈ క్రమంలో ఎలాగూ తనకు టీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్న రాజయ్య.. తనకు మంచి గుర్తింపు దక్కించుకునేలా వైఎస్సార్టీపీ వైపు చూస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భేటీపై టీఆర్ఎస్ లో అంతర్గతంగా చర్చ జరుగుతున్నా.. ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు.
వార్తల్లో నిజం లేదట
అయితే ఈ విషయంలో రాజయ్య సోమవారం ఉదయం స్పదించారు. తాను అసలు లోటస్ పాండ్ కే వెళ్లలేదని, బ్రదర్ అనిల్ ను కలవలేదని రాజయ్య చెప్పుకొచ్చారు. బ్రదర్ అనిల్ తో తాను కలిసినట్లుగా, అందుకోసం తాను లోటస్ పాండ్ కు వెళ్లినట్లుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం టీఆర్ఎస్ లోనే ఉంటానని కూడా రాజయ్య చెప్పుకొచ్చారు. మొత్తంగా లోటస్ పాండ్ కు వెళ్లి బ్రదర్ అనిల్ తో రాజయ్య భేటీ అయ్యారని ఆదివారం రాత్రి నుంచి వార్తలు వినిపిస్తుంటే.. సోమవారం ఉదయం ఆ వార్తలన్నీ అవాస్తవాలేనంటూ రాజయ్య ప్రకటించడంతో అసలు రాజయ్య లోటస్ పాండ్ కు వెళ్లారా? లేదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కోమటిరెడ్డి రెడీ.. కేసీఆర్‌దే ఆలస్యం