కరోనా కారణంగా వినోద రంగం కుదేలైంది. అటు ఓటీటీ, ఇటు 50 శాతం ఆక్కుపెన్సీతో సినిమా థియేటర్లు ఏ మాత్రం ఊరటను ఇవ్వలేకపోయాయి. ప్రభుత్వం కూడా క్రమేపీ ఆంక్షలను తగ్గిస్తూ వస్తోంది. తాజా వార్త ఏమిటంటే అన్ లాక్ కొత్త నిబంధనలు. ముఖ్యంగా సినిమా హాళ్లకు ఫుల్ పర్మిషన్ వచ్చేసినట్టే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాల్సి ఉంది. చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకూ ఇది శుభపరిణామమని చెప్పాలి. కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త నిబంధనలు విడుదల చేసింది.
ఫిబ్రవరి 1 నుంచే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇప్పటిదాకా ఉన్న 50 శాతం ఆక్కుపెన్సీకి ప్రభుత్వం కూడా రాయితీలు ఇచ్చి వెసులు బాటు కల్పించడంతో నిర్మాతలు కూడా సినిమా విడుదలకు ముందుకు వచ్చారు. ఇప్పటికే చాలా సినిమాలు నిర్మాణం పూర్తయి విడుదలకు ఎదురుచూస్తున్నాయి. ఫుల్ ఆక్యుపెన్సీ వస్తే చాలా సినిమాలు విడుదలకు క్యూకట్టాల్సిందే.
వరుసగా ఇక విడుదలలే
ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. 50 శాతం ఆక్కుపెన్సీ, దానికితోడు ఒకేసారి నాలుగు సినిమాలు విడుదల కావడం థియేటర్ల సమస్యకు దారితీసింది. అసలు జనం థియేటర్లకు వస్తారా రారా అన్న అనుమానంతో పెద్ద హీరోల సినిమాలు ఈసారి సంక్రాంతికి రాలేదు. వాటి షూటింగులు పూర్తి కాకపోవడం కూడా మరో కారణం. ఇప్పటిదాకా ఆగిపోయిన సినిమాలన్నీ ఇక క్యూకడుతున్నాయి. రేపు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలవుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ఫుల్ ఆక్యుపెన్సీ ఉంటే ఇక థియేటర్ల దగ్గర ఆ కళే వేరు.
కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ నిబంధనలు సడలిస్తున్న వార్తలు రావడంతోనే చిత్ర పరిశ్రమ అలెర్ట్ అయ్యింది. సాధారణంగా సంక్రాంతి సీజన్ పూర్తయ్యాక థియేటర్లు కళతప్పుతాయి. ఎందుకంటే ఈ సీజన్ నే టార్గెట్ గా చేసుకుని విడుదల ప్లాన్ చేసుకుని ఉంటారు. దాంతో పెద్ద సినిమాలు జనవరిలోనే వచ్చేవి. ఈసారి అలా కాదు మంచి అంచనాలు ఉన్న సినిమాలన్నీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫిబ్రవరిలో ఓ మాదిరి సినిమాలు విడుదలైనా మార్చి వచ్చేసరికి సినిమా పరిశ్రమ కళకళలాడనుంది.
మిస్టర్ అండ్ మిసెస్, అన్నపూర్ణమ్మగారి మనవడు, దేవినేని, చెప్పినా ఎవరూ నమ్మరు, ఉప్పెన, జైసేన, అమ్మదీవెన, కళాపోషకులు, నాతో ఆట, జాంబిరెడ్డి, చెక్, శశి, ఎఫ్.సి.యు.కె., ఏ1 ఎక్స్ ప్రెస్, అక్షర లాంటి సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. మార్చి నెల నుంచి పవర్ స్టార్, మెగాస్టార్ ల సందడి మొదలవుతుంది. వకీల్ సాబ్ విడుదల మార్చిలోనే అంటున్నారు.
ఇక ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, నారప్ప, బాలకృష్ణ – బోయపాటిల సినిమా, కేజీఎఫ్ 2, శ్రీకారం, అరణ్య లాంటి సినిమాలు ఉన్నాయి. నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ మార్చిలో విడుదలకానుంది. ఇవికాకుండా డబ్బింగ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు వరుసలో ఉన్నాయి. సినిమా రంగానికి పూర్వవైభవం వచ్చేసినట్లుగానే భావించాలి.
Must Read ;- ‘సలార్, కేజీఎఫ్’ రెండింటికీ పోలిక ఉందా.?