ఏపీలో ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమమే హాట్ టాపిక్. రాజకీయపార్టీలకూ అది ప్రాధాన్య అంశమే. ఓవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది. అదే సమయంలో ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని బీజేపీ సారథ్యంలోని కేంద్రం ప్రకటించింది. ఈ విషయంలో బీజేపీ ఎలాగూ నోరు మెదపలేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది ఆ పార్టీనే కాబట్టి.. ఈ విషయంలో నోరుమెదిపే పరిస్థితి లేదు.
ఇక ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీలు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నాయి. టీడీపీ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతోంది. వైసీపీ విషయానికి వస్తే బీజేపీని, టీడీపీని ఇరికించాలనుకుంది. అయితే రాజ్యసభలో కేంద్ర మంత్రి 2019లోనే ఒప్పదం జరిగిందని చెప్పడం మొదలు.. రెండురోజుల క్రితం నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి నోటిమాటరాకుండా చేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో స్వయంగా సీఎం జగన్ ధిల్లీకి వెళ్లి మోదీని కలిసి ఒప్పించడం ఒక్కటే ఆ పార్టీ ముందు ఉన్న అవకాశంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా తాము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని, అందుకు కేసీఆర్ అనుమతితో తానే వచ్చి ఉద్యమంలో పాలుపంచుకుంటానని ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. ఎటొచ్చీ జనసేన మాత్రమే ఎటూతేల్చుకోలేకపోతోంది.
తొలినాళ్లలో స్పీడుగానే..
విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నారన్న ప్రకటన వచ్చిన తొలినాళ్లలో జనసేన స్పీడుగానే స్పందించింది. అయితే గత వారం రోజులుగా జనసేన విశాఖ ఉక్కు విషయంలో పెద్దగా స్పందన లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో స్థానికంగా ఉండే నాయకులు హాజరుకావడం తప్ప పార్టీ పిలుపులు లేవని చెప్పాలి. అందుకు బీజేపీ నుంచి వచ్చిన సంకేతాలే కారణమనే చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే..తమ పార్టీపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని జనసేన నాయకులే చర్చించుకుంటున్నారు.
కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలోని అర్బన్ ప్రాంతాలు మినహా అక్కడ జనసేనకు బలం తక్కువే. అలాంటిది..కోస్తాంధ్రలో కీలకమైన, ఉత్తరాంధ్రతో తీవ్ర ప్రభావం చూపే విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో జనసేన నోరు మెదపకపోతే రానున్న కాలంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనన్న ఆందోళన ఆ ప్రాంత జనసేన నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అమరావతి విషయంలో జనసేన వ్యూహం అనుమానాస్పదంగా మారింది.
సీటు కోసం చూస్తే పార్టీ..
తిరుపతి లోక్‌సభ అభ్యర్థి విషయంలో జనసేనకు బీజేపీ మధ్య గతంలో అభిప్రాయ బేధాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలపై పవన్ కల్యాణ్ అసనహనం వ్యక్తం చేయడంతో పాటు సర్దుకుపోతేనే పొత్తు అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్ వచ్చి పవన్‌తో చర్చలు జరిపారు. ఇరుపక్షాలు చర్చించుకుని అభ్యర్థిని ప్రకటిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మార్చి 5న అమిత్ షా తిరుపతికి రానున్నారన్న సమాచారం వచ్చింది. అప్పుడు క్లారిటీ వస్తుందని భావించినా.. అమిత్ షా పర్యటన వాయిదా పడింది. దీంతో జనసేన ఆశలపై నీళ్లు జల్లినట్టైంది.
తిరుపతి సీటు కోసం పవన్ కల్యాణ్ సైలెంట్‌గా ఉంటున్నారా అనే సందేహాలూ మొదలయ్యాయి. తిరుపతి సీటు కోసం విశాఖ ఉక్కు సంస్థ విషయంలో సైలెంట్‌గా ఉంటే.. జనసేన తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకున్నట్లు అవుతుందనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఢిల్లీలో పెద్దలను కలిస్తే సరిపోదని, క్షేత్ర స్థాయిలో ఉద్యమంలో పాల్గొంటేనే ఉద్యమానికి అండగా ఉన్నట్లని వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. జనసేనకు ఏమాత్రం బలహీనమైనా, ప్రభావం తగ్గినా బీజేపీ పవన్‌ను దూరం పెట్టేందుకు కూడా వెనుకాడదంటున్నారు. ఆ బలం జనసేన పార్టీకి ఉండాలంటే..ప్రజా ఉద్యమాలే మార్గమని నాయకులు చర్చించుకుంటున్నారు. మరి జనసేనాని అస్త్ర సన్యాసం వీడి ఉద్యమం వైపు వస్తారా లేదా అనేది చూడాలి.
Also Read : జనసేన-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..