(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వైసీపీ ప్రభుత్వంలో అన్నీ వింతలే చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురిచేయడం మనం చూస్తుంటాం. దీనికి రివర్స్ గేర్‌లో- ప్రభుత్వం స్థానిక పరిస్థితులను అంచనా వేయకుండా, నాయకులతో సంప్రదించకుండా తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేస్తున్నాయి.. ఇప్పుడు ఇటువంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిని ఇబ్బంది పాలు చేస్తోంది.
ఉవ్వెత్తున ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా, ఉత్తరాంధ్ర ధాన్యాగారంగా పేరుగాంచిన పాలకొండ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని కొద్దిరోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతోంది. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పాలకొండ ప్రాంత నాయకులు, ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పాలకొండ జిల్లా సాధనా సమితిగా ఆవిర్భవించి పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా మిగిలిన శ్రీకాకుళంలో అత్యంత నిర్లక్ష్యానికి, వెనుకబాటుకు గురైన ప్రాంతం ఏదైనా వుంది అంటే నిర్వివాదాంశంగా పాలకొండ అని చెప్పొచ్చు. వ్యవసాయమే జీవనాధారంగా, సమతకు, సౌభ్రాతృత్వానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్న ఈ ప్రాంత ప్రజలు ఏనాడూ తరతమ భేదాలకు, క్షుద్రరాజకీయాలకు తావివ్వలేదు. అందువల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరాన నిలిచిపోయిందని చెప్పకతప్పదు. ఒకరిద్దరు ఈ ప్రాంత నాయకులు రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా అభివృద్ధిని పట్టించుకోలేదు. అందువల్ల ఈ ప్రాంతం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మిగిలిపోయింది.
Must Read ;- కొత్త జిల్లాలు అడిగితే.. అణచివేతలు తప్పవ్!
కొత్త జిల్లాల ఏర్పాటు..
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. ఈ ప్రాంత వాసులకు ‘పుండు మీద కారం చల్లినట్టు’ తయారవగా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తానని జగన్ ప్రకటించడం.. దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించడం తెలిసిందే. ఇప్పటికే కమిటీలు కూడా వేశారు.. కేబినెట్‌లోనూ చర్చించారు. మొత్తంగా ఒక వ్యూహం ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఆయా జిల్లాలు, అక్కడ భౌగోళిక పరిస్థితులు, వనరులు, అవకాశాలు అంచనా వేయకుండా .. పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లాగా నిర్ణయించడానికి సిద్ధమవ్వడమే సమస్యకు కారణమవుతోంది. అధికార పార్టీ నేతలను ఇరుకున పెడుతోంది.
ఇప్పటికే ప్రస్తుతం ఉన్న చాలా జిల్లాల్లో మా ప్రాంతాన్ని జిల్లా చేయాలంటే.. మా ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ.. ఉద్యమాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల తమ ప్రాంతాలు / నియోజకవర్గాలకు కొత్త జిల్లాల్లో కలపవద్దని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల ఏర్పాటు కూడా తలనొప్పిగా మారింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికీ ఏమీ చెప్పలేక.. తాము ఏమీ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇది చివరికి తమ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందేమో.. అని తర్జన భర్జన పడుతున్నారు. ఇలాంటి సమస్యే ఇప్పుడు శ్రీకాకుళంలోనూ వచ్చింది.
వైసీపీ నాయకులే వద్దంటూ ..
వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాను విభజించి రెండు జిల్లాలు చేయొద్దని.. వైసీపీ నాయకులే కోరుతున్నారు. దీనివల్ల ఇప్పటికే వెనుకబడిన జిల్లా కాస్తా.. మరింత వెనుకబడుతుందని వారు అంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా దీనిపై బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. ఇక గుంటూరు, నెల్లూరు, మదనపల్లి లాంటి చోట్ల కూడా సొంత పార్టీ నేతల నుంచి ఇదే తరహా అభ్యంతరాలు జోరందుకున్నాయి. చివరకు జగన్ వార్నింగ్ ఇస్తే గాని వీరు వెనక్కు తగ్గలేదు.
ప్రత్యేక జిల్లాగా..
శ్రీకాకుళం జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గం పాలకొండలో మరో సరికొత్త డిమాండ్ ఊపందుకుంది. పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ.. ఇక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. తమను అరకు లేదా పార్వతీపురం జిల్లాల్లో కలిపితే సహించమని.. పాలకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే కళావతి ఇరుకున పడుతున్నారు. ఈ ఉద్యమంలో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
ఆందోళనలో కళావతి…
ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచిన కళావతికి గిరిజనుల్లో మంచి పట్టుంది. ఎస్టీ వర్గంలో వైసీపీ నుండి ఆమె మంచి లీడర్‌గా ఎదిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే తాజా డిమాండ్‌తో ఆమె తన ఓటు బ్యాంకు ఎక్కడ చెల్లాచెదరవుతుందో ? అన్న ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే.. ఈ డిమాండ్ నెరవేర్చడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అటువంటప్పుడు తన ఓటు బ్యాంకు చెల్లాచెదురై భవిష్యత్ రాజకీయాలకు ముప్పు తెచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విషయంపై స్థానికులను ఒప్పించి, ఉద్యమాన్ని చల్లార్చే పరిస్థితి దరిదాపుల్లోనూ కనిపించడం లేదు. అలా అని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లే సాహసం ఆమె చేయడం లేదు. అందువల్ల ఆమె ఇరుకున పడినట్లు .. భవిష్యత్ రాజకీయం అగమ్యగోచరంగా తయారైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రజలకు సర్దిచెప్పగలరో లేదో వేచి చూడాలి.
Also Read ;- రామ్మోహన్‌ను నాగ్ ఢీ కొనగలరా