షర్మిల కొత్త పార్టీని ఏప్రిల్ 10వ తేదీన పార్టీ పేరును ప్రకటించాలని షర్మిల నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకీ ఏప్రిల్ 10నే ఎందుకు ఎంచుకున్నారు? అంటే.. ఆ రోజు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన రోజు. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బాటలు వేసిన రోజు. అందుకే తండ్రి సెంటిమెంటు కలిసొస్తుందని భావిస్తున్న షర్మిల.. తన కొత్త పార్టీ ప్రకటనకు ఆ తేదీనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లేదంటే అదే రోజు, అదే చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది.
ఆత్మీయ సమ్మేళనాలు..
ఉమ్మడి జిల్లాల వారీగా ప్రారంభించిన ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్ మొదటివారం కల్లా పూర్తి చేయాలని షర్మిల బృందం ప్రాథమికంగా నిర్ణయించడమూ ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. వచ్చే ఏప్రిల్ 10 నాటికి చేవెళ్లలో వైఎస్సార్ ప్రారంభించిన పాదయాత్రకు 18 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే తన పార్టీకి సంబంధించి కీలక కార్యక్రమాన్ని అదే రోజు షర్మిల పెట్టుకోనున్నట్లు చెబుతున్నారు. ఈలోపు నిర్వహించే ఆత్మీయ సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా పార్టీ విధి విధానాలు, జెండాను నిర్ణయించాలన్న ఆలోచనలోనూ షర్మిల బృందం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో వీటికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Must Read ;- షర్మిలతో రాజన్న రాజ్యం సాధ్యమా?











