ఏపీ సీఎం జగన్ చెల్లి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చేసిన రాజకీయ విశ్లేషణకు భిన్నంగా తెలంగాణలో షర్మిల పార్టీ పెడుతున్నట్టు తెలుస్తోంది. అసలైన రాజన్న రాజ్యం అంటే ఏమిటో చూపించడానికి తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దీని వెనుక తెలంగాణ సీఎం వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోంది. హైదరాబాద్ ఎన్నికల్లో ఆ విషయం రుజువైంది. ఇక ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తెలంగాణ శాసనసభలోనూ బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణలో బీజేపీకి బ్రేకులు వేసేందుకే షర్మిలను రంగంలోకి దింపి కొత్త పార్టీ ఏర్పాటు చేయిస్తున్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి.
తెలంగాణలో కొత్తపార్టీ ఎందుకంటే?
తెలంగాణలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో సెటిలర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ మొత్తం మీద 48 లక్షల సెటిలర్ల ఓట్లు ఉన్నాయని ఓ అంచనా. వీరిలో 90 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు. సెటిలర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే సమాచారం స్పష్టంగా ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రావారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ పై సెటిలర్లు ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేయడంలో కూడా కేసీఆర్ కీలకపాత్ర పోషించారని సెటిలర్లు నమ్ముతున్నారు. ఇక తెరాసలో సెటిలర్లకు స్థానం లేదు. ఆ పార్టీలో ఒక్క సెటిలర్ కూడా గొప్ప పదవుల్లో లేకపోవడమే ఇందుకు కారణం.
అందుకే సెటిలర్లు గుంపగుత్తగా బీజేపీ వైపు మొగ్గారని తెలుస్తోంది. దీని వల్లే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 44 కార్పొరేషన్ స్థానాలు కైవశం చేసుకోగలిగిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గెలువడం ఈ విశ్లేషణలకు ఊతం ఇస్తోంది. సెటిలర్లు ఎటు మొగ్గితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే తెరాస అధినేత కేసీఆర్, జగన్ తో సంప్రదించి షర్మిలతో కొత్తపార్టీ ఏర్పాటు చేయిస్తున్నారని తెలుస్తోంది. సెటిలర్ల ఓట్లు ఎలాగూ తెరాసకు వచ్చే అవకాశం లేదు గనుక, బీజేపీ ఖాతాలో పడకుండా చూడాలనే వ్యూహం అమల్లో భాగంగానే షర్మిలతో కొత్తపార్టీ ఏర్పాటు చేయిస్తున్నారనేది ఒక విశ్లేషణ.
Must Read ;- జగనన్న వదిలిన బాణమా? వదిలించుకున్న బాణమా?
బీహార్‌లో బీజేపీ వ్యూహమే.. కేసీఆర్‌కు ఆదర్శమా!
‘మనకు పడని ఓట్లు మన ప్రత్యర్థికి రాకుండా చేయడం’ అనేది ఇప్పటికే బీజేపీ అమలు చేస్తున్న వ్యూహం. బీహార్ లో ఎల్జేపీని ఒంటరిగా పోటీ చేయించి దళితుల ఓట్లు ఆర్జేడీ ఖాతాలో పడకుండా అడ్డుకోగలిగారు. దీని వల్ల 31 స్థానాల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. ఇదే సూత్రాన్ని తెరాస అధినేత వచ్చే ఎన్నికల నాటికి అమల్లోకి తీసుకువచ్చే ప్లాన్ వేసినట్టుగా కొందరు విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే షర్మిలతో తెలంగాణ వైసీపీ ఏర్పాటు చేయించి సెటిలర్ల ఓట్లు బీజేపీకి దక్కకుండా చేసే ఎత్తుగడలో భాగంగానే వచ్చే నెలలో ఆమె పార్టీ ప్రకటిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే జరిగితే తెరాస వ్యూహం బీజేపీని దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదు.
షర్మిల, జగన్ మధ్య వైరం నిజంకాకపోవచ్చు
ఏపీలో రాజన్న రాజ్యం తేవడంలో జగన్ రెడ్డి విఫలం చెందాడని కోపంతో ఉన్న షర్మిల తెలంగాణలో కొత్తపార్టీ ఏర్పాటు చేయడం ఏంటి. వినడానికే వింతగా, కామెడీ గా ఉంది. అన్నపై కోపం ఉంటే ఏపీలో కొత్తపార్టీ ఏర్పాటు చేసి కసి తీర్పుకోవాలి కానీ, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసి తెరాస ప్రత్యర్థుల బలం తగ్గించడానికే కదా. గ్రేటర్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయని వైసీపీ, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు పావులు కదుపుతోంది అంటే దీని వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారనేది సుస్పష్టం.
ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. షర్మిల ఏర్పాటు చేసే కొత్తపార్టీ, తెలుగుదేశంలాంటి పార్టీలు సెటిలర్ల ఓట్లు చీల్చగలిగితే తెలంగాణలో తెరాస విజయం తేలికవుతుంది. ఓటర్లలో సాధ్యమైనన్ని చీలికలు తేవడం ద్వారా విజయం సాధించడం కోసం తెరాస అధినేత వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో మరో కొత్తపార్టీ, అంటే ఇప్పటికే ఉన్న వైసీపీని తెలంగాణ వైసీపీగా లేదంటే, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీగా నామకరణం చేసి షర్మిలను రంగంలోకి దింపడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో కొత్తపార్టీ వస్తుందనే ప్రచారం సాగుతోంది. మరో నెల రోజుల్లో అంటే ఫిబ్రవరి 9న కొత్తపార్టీ ప్రకటన ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. కొత్తపార్టీ రావడం మాత్రం ఖాయం, అది ఎప్పుడు వస్తుందనేని ఒక నెల అటు ఇటు కావచ్చని మాత్రం చెప్పవచ్చు.
ఇదీ చదవండి :
జగన్ మీద వ్యతిరేకతతో షర్మిల కొత్త పార్టీ : ఆంధ్రజ్యోతి కథనం
Also Read ;- పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!