తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి, నిదానమే ప్రధానం అన్నట్టుగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తున్నాడు శర్వానంద్ . కథాకథనాల్లో కొత్తదనం ఉంటేనే తప్ప, శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. అందువల్లనే ఆయన వేగంగా వరుస సినిమాలు చేసిన దాఖలాలు కనిపించవు. క్రితం ఏడాది ఆయన నుంచి వచ్చిన ‘జాను’ పరాజయం పాలైంది. నిదానంగా కథలను ఎంచుకుంటే ఫరవాలేదుగానీ, నిదానంగా సాగే కథను ఎంచుకోవడం వలన ఫ్లాప్ ను అందుకోవలసి వచ్చింది. ఆ తరువాత ఆయన ‘శ్రీకారం’ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.
కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శర్వానంద్ సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. ఈ సినిమా టీజర్ కి .. లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జె.మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇదే ఏడాది ద్వితీయార్థంలో శర్వానంద్ మరో సినిమా ద్వారా కూడా ప్రేక్షకులను పలకరించనున్నాడు .. ఆ సినిమా పేరే ‘మహాసముద్రం’.
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో రొమాన్స్ ను రొటీన్ కి భిన్నంగా ఆయన ఆవిష్కరించిన తీరుకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఆ తరువాత ఆయన మరో కొత్త కథను రెడీ చేసుకుని రంగంలోకి దిగాడు .. ఆ సినిమాకి ‘మహాసముద్రం’ అనే టైటిల్ ను సెట్ చేశాడు. ఈ కథలోని కొత్తదనం నచ్చిన కారణంగా శర్వానంద్ వెంటనే ఒప్పేసుకున్నాడు. వైజాగ్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా సాగనుంది. ఇందులో శర్వానంద్ పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందని అంటున్నారు. సిద్ధార్థ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను తమిళంలోను విడుదల చేయనున్నారు.
Must Read ;- మెడికల్ థ్రిల్లర్ లో నటించబోతున్న యంగ్ హీరో