బాలీవుడ్ లో శిల్పా శెట్టి పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది యోగానే. ఈ పొడుగు కాళ్ల సుందరి భర్త రాజ్ కుంద్రా పేరు వినగానే ‘భోగం’ గుర్తుకొస్తోంది. వీరి యోగభోగాల వెనక ఏం నిజానిజాలెంత? ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. సినిమా రంగంలో ఏ చిన్న గబ్బు బయటికి వచ్చినా పెద్ద రాద్దాంతమే జరుగుతుంది. గత ఏడాది అంతా డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ ను కుదిపేసింది. ఈ ఏడాది ఆ లోటును వెబ్ చిత్రాల గబ్బు భర్తీ చేసేలా ఉంది.
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పోర్న్ చిత్రాలు తీస్తున్నాడన్నది అతని మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ సినిమాల నిర్మాణానికి సంబంధించిన అంశం పోలీసుల దృష్టికి ఫిబ్రవరిలోనే వచ్చింది. వారు దర్యాప్తు ప్రారంభించి రాజ్ కుంద్రానే ఇందులో కీలక పాత్రధారి అని నిర్ధరించారు. బూతు చిత్రాల నిర్మించడం, వాటిని వివిధ యాప్ లలో అప్ లోడ్ చేయడం కారణంగా ఆయనపై ఈ కేసు నమోదైంది. దీనికి ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.
బ్లూ ఫిలింల స్థానంలోనే వెబ్ సిరీస్
ఒకప్పుడు బ్లూ ఫిలింస్ హవా నడిచేది. బూతు చిత్రాలు తీయడం, వాటి క్యాసెట్లు, సీడీలు మార్కెట్లోకి విడుదల చేయడం జరిగేది. ఇంటర్ నెట్ వచ్చాక కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఓటీటీల్లోనూ బూతు కంటెంట్ ఎక్కువగా వస్తోంది. వెబ్ సిరీస్ పేరుతో అడల్ట్ కంటెంట్ వస్తోంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసే పరిస్థితి లేదు. దానికి తోడు రకరకాల యాప్ ల ద్వారా బూతు చిత్రాలను అప్ లోడ్ చేస్తున్నారు. వీటిని తీయడానికి కథతో పనిలేదు. అందమైన అమ్మాయిలను తీసుకుని ఇష్టమొచ్చిన రీతిలో బూతు చిత్రాలు తీసి వదులుతున్నారు. ఇవాళ రాజ్ కుంద్రా పేరు బయటికి రావచ్చు.. రేపు ఇంకా కొన్ని పేర్లు కూడా వచ్చే అవకాశం లేకుండా పోదు.
తనపై వస్తున్న ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండిస్తున్నారు. పోర్న్ చిత్రాలు తీస్తున్న సంస్థతో తాను గతంలోనే తెగతెంపులు చేసుకున్నట్లు చెబుతున్నారు. రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఇది మొదటిసారి కాదు. 2013లో అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ లో పాల్గొనకుండా నిషేధం కూడా అతనిపై విధించారు. 2018లో బిట్ కాయిన్ కుంభకోణంలోనూ అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడీ ఆరోపణలతో అతని పరువు వీధినపడింది. లఘు చిత్రాలు, వెబ్ సిరీస్ ల పేరుతో సాగే బూతు భాగోతాలకు ఫుల్ స్టాప్ పడటం మాత్రం అసాధ్యంలానే కనిపిస్తోంది.
Must Read ;- అదిరేటి కాంబో!.. ‘స్కామ్’ స్టార్‌తో జగన్ బయోపిక్!