నాని పక్కా ప్లానింగుతో ఉన్నాడు .. ముందుగా అనుకున్న ప్రకారమే ‘టక్ జగదీశ్‘ ను పూర్తిచేసిన ఆయన, ఈ రోజున ‘శ్యామ్ సింగరాయ్’ను మొదలుపెడుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్ జగదీశ్’ చేస్తూ వస్తున్నాడు. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా, రీసెంట్ గా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఏప్రల్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాగా నాని ‘శ్యామ్ సింగ రాయ్’ చేస్తున్నాడు. రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
కథా పరంగా ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో జరుగుతుంది. అందువలన కలకత్తాలోనే షూటింగు జరపడానికి రంగంలోకి దిగారు. కలకత్తాలో ఈ రోజున ఈ సినిమా షూటింగును మొదలుపెడుతున్నారట. నానీ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు అలరించనున్నారు. సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోనా సెబాస్టియన్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. చాలా కాలం తరువాత మడోనా మళ్లీ తెలుగు సినిమాలో చేస్తుండటం విశేషం.
కలకత్తా షెడ్యూల్ పూర్తయిన తరువాత, హైదరాబాద్ లో షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో భారీ సెట్లు కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా సాగనుంది. ఇంతవరకూ నాని చేస్తూ వచ్చిన సినిమాలకి ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉండనుందని అంటున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత నాని ‘అంటే .. సుందరానికీ!’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
Must Read ;- నాని సినిమా సెట్ కోసం అంత ఖర్చు పెడుతున్నారా.?











