యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు లైన్ లో పెడుతూ.. వాటికి రిలీజ్ డేట్స్ లాక్ చేస్తూ.. అభిమానులకి వరుసగా సర్ ప్రైజులిస్తున్నాడు. అందులో ముందుగా ‘రాధేశ్యామ్’ .. ఈ ఏడాది జూలై 30న విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో పాన్ ఇండియా మూవీ .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సలార్’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ డేట్ ఖాయం చేసుకుంది.
ఇక ఇప్పుడు ప్రభాస్ మరో సూపర్ మూవీ ‘ఆదిపురుష్’ కి సంబంధించిన అప్డేట్స్ కూడా అభిమానుల్ని ఖుషీ చేస్తున్నాయి. మరో వారంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. అలాగే.. ఇందులో నటించే సీతాదేవి పాత్ర ఎంపిక కూడా పూర్తయిందని చెప్పుకుంటున్నారు. నిన్న మొన్నటివరకూ ఇందులో సీతాదేవిగా కియారా అద్వానీ, కృతిసనన్ పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు లిస్ట్ లోకి మహానటి కీర్తి సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయిందని వినికిడి.
ప్రభాస్ శ్రీరాముడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ రావణుడిగానూ నటిస్తున్న ఈ సినిమా 3డి పార్మెట్ లో రూపొందుతోంది. భారతీయ ఇతిహాస కావ్యం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ లో .. నిర్మిస్తున్నారు. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్ ’ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కోసం హాలీవుడ్ సంస్థ పనిచేస్తోంది. అలాగే.. మిగిలిన పాత్రల్ని వివిధ భాషల్లోని నటీనటుల్ని ఎంపిక చేస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఇక ఈ సినిమాలోని శ్రీరాముడి లుక్ కోసం బాగా సన్నబడేందుకు జిమ్ లో ఓ రేంజ్ లో కసరత్తులు చేస్తున్నాడు ప్రభాస్. మరి అతడి జోడీ సీతాదేవి గా కీర్తి సురేష్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.











