లెజెండరీ సింగర్ యస్పీ బాలసుబ్రహ్మణ్యం తన సినీ కెరీర్ లో వేల పాటలు పాడారు. అలాగే.. ఎన్నో వందల గీతాల్ని వివిధ వేదికల మీద ఆలపించారు. భాషతో సంబంధం లేకుండా భారతీయ ప్రేక్షకుల్ని తన గాన మాధుర్యంతో మంత్ర ముగ్ధుల్ని చేశారు. సినిమాల్లో పాడడం ఆపేసి చాలా రోజులైనప్పటికీ… ఆయన ఏనాడూ ఖాళీగా లేరు. ఏదో ఒక వేదికపై తన పాటల ప్రయాణాన్ని కొనసాగించారు.
అలాంటి ఆ మహానుభావుడు ప్రారంభించిన సింగింగ్ షో ‘పాడుతా తీయగా’. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో గాయనీ గాయకుల్ని తయారు చేశారు. అలాగే.. సినీ రంగంలోనూ అవకాశాలిప్పించారు. ఈ షోలో గాయనీ గాయకులు పాడే పాటలు, ఆ పాటల వెనుకనున్న ఆసక్తికరమైన విశేషాలకు విశేష ప్రజాదరణ లభించింది. అలాంటి ఈ అద్భుతమైన షో.. బాలు మరణంతో ఆగిపోయింది.
ఈ షో లో బాలు స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నది వాస్తవం. అందుకే ‘పాడుతా తీయగా’.. ప్రోగ్రామ్ ని శాశ్వతంగా ఆపేస్తారని అందరూ అనుకున్నారు. అయితే త్వరలో ఆ షోకి సంబంధించిన బాధ్యతల్ని రామోజీరావు యస్పీబాలు తనయుడు యస్పీ చరణ్ కు అప్పగించబోతున్నారు. ఈ షోను చరణ్ తో కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో తండ్రి లెగసీని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత చరణ్ భుజాలపై పడింది. అయితే ఈ కార్యక్రమంలో చరణ్ తో పాటు గాయని సునీత, ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ న్యాయ నిర్ణేతలుగా ఉండబోతున్నారు. రీసెంట్ గా పాడుతా తీయగా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మరి తండ్రి లెగసీని కొడుకు చరణ్ కొనసాగించి షోని ఎలా రక్తికట్టిస్తాడో చూడాలి.
Must Read ;- కళాత్మక దృశ్య కావ్యం ‘సాగర సంగమం’ @ 38