గాన గంధర్వుడు బాలు 75వ జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమ ఆ మహానుభావుడికి స్వరనీరాజనం అర్పిస్తోంది. ఈ సంద్భరంగా ఏర్పాటైన కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సాయికుమార్ వ్యాఖ్యత గా వ్యవహరించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా.. అందరినీ జూమ్ కాల్ లో కనెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి బాలు గురించి మాట్లాడారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
బాలు.. నా సినిమా జీవితంలో సగ పాలు మా బాలు అన్నయ్యకే దక్కుతుంది. ఎందుకంటే సినిమాల్లో నా ఆటకు బాలు పాటే తోడయ్యింది. ఆ పాటతోనే నేను ఎదిగాను.. ఒకటా రెండా బాలు అన్నయ్య గొంతే నాకు ఎన్నో పాటల్ని అందించింది. వేల పాటల్ని అందించిన బాలు స్వరనీరాజనంలో నాలుగు మాటల్ని అందించడంకంటే నాకు గర్వకారణం ఇంకేముంటుంది. నాకు అత్యంత ఆప్తుడైన బాలు అన్నయ్య గురించి, ఆయన జ్ఞాపకాల గురించి నెమరువేసుకున్న సందర్భాలు అనేకం. భాష మీద, భావం మీద పట్టున్న నేపథ్య గాయకులు అరుదు. ఆ గాత్రంలోని మాధుర్యంవల్లే నేను కూడా అంతలా స్పందించి డ్యాన్సులు చేయగలిగానేమో అనిపిస్తుంది. బాలుగారిలోని రెండు పార్శ్వాలు అంటే నాకు ఎంతో ఇష్టం. అందులో ఒకటి ఆయన వ్యక్తిత్వం, ఇంకొకటి ఆయన గాత్రం.. ఈ రెండూ అసాధ్యమైనవే. నిండుగా మానవత్వంతో ప్రవహించే నదిలాంటి వారు బాలు. ఎవ్వరినీ నొప్పించని గొప్ప సంస్కారవంతుడాయన. ఆయనలోని హాస్య చతురత నన్ను విశేషంగా ఆకర్షించేది. అమాయకంగా, అల్లరిగా, జిజ్ఞాసువుగా కనిపించేవారు. చిద్విలాసంగా హుషారుగా ఉండే బాలూగారిని చూస్తే నాలో గొప్ప ఎనర్జీ కలిగేది. అదే సమయంలో ఆయనొక ఫిలాసఫర్ గా, భావుకుడిగా కూడా కనిపించేవారు. ఇక ఆయన నాకు చాలా ప్రత్యేకంగా పాటలు పాడేవారు. ఆ పాటలకు తగ్గట్టుగా తనని ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పేవారు. అలాగే ఆయనపాటలకు నేను ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేవాడిని.
మరణం అనేది కేవలం భౌతికమైనదే. బాలు లాంటి వారు ఎప్పటికీ చిరంజీవులుగానే ఉంటారు. ఆయన సృష్టించిన పాటల సంపద, సంగీత నిధి ఎన్ని తరాలైనా తరగదు. బాలుగారు అస్తమించని సూర్యుడు, ఆరని సంగీత జ్యోతి. ‘పాడుతా తీయగా’ లాంటి కార్యక్రమాల ద్వారా వేలాది యువ గళాలను వెలుగులోకి తెచ్చారు. సినీ పాటల ప్రపంచాన్ని పరిపుష్టం చేశారు. ఔత్సాహిక గాయనీగాయకులకు పథనిర్దేశం చేశారు. బాలుగారి గురించి చెప్పాలంటే గంటలు, రోజులు సరిపోవు. ఆయన గురించి మాట్లాడుతుంటే ఏదో తెలియని శక్తి ఒళ్లంతా ఆవహించినట్టుగా ఉంది. ఆయన పాటలేని లోటు నా సినిమాల్లో ఎప్పటికీ ఉంటుంది. ఆయన మిగిల్చి వెళ్లిన అమృతగానం, ఆ అనుభూతులు నన్ను వదిలి వెళ్లిపోవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని నేను బాలు అన్నయ్యను చూసే నేర్చుకున్నా. తెలుగు పాటకు ఓ ఎన్ సైక్లోపీడియా లాంటి బాలు అన్నయ్య జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆ తర్వాత బాలు పెద్ద చెల్లెలు స్వయంగా రాసి పాడిన ఒక పాటను చిరు ఈ సందర్భంగా ఆవిడ పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమలో ఆవిష్కరించారు.
Must Read ;- ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే: చిరంజీవి