గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ఇసప్పాలెంలో వైసీపీ నాయకులు ఓ కాలనీలో డ్రైనీజీ కాలువలు, మెట్లు ధ్వంసం చేసిన సంఘటనలను తెలుగుదేశం పార్టీ బృందం ఇవాళ పరిశీలించింది. నరసరావుపేట టీడీపీ ఇంఛార్జి అరవింద్ బాబు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, వర్లరామయ్య, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జీవీ ఆంజనేయులు బాధితులకు ధైర్యం చెప్పారు. నరసరావుపేట ఎమ్మెల్యే తమ కాలనీ వారిని పది లక్షలు డిమాండ్ చేశాడని, ఇవ్వలేదనే కొపంతో కూల్చివేతలకు దిగాడని బాధితులు బోరున విలపించారు. ఇసప్పాలెంలో టీడీపీకి చెందిన బిల్డర్ రమేష్ నిర్మించిన గృహాలను గోగులపాడు గ్రామస్థులు కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. గోగులపాడులో రమేష్‌కు అనుకూలంగా ఈ కాలనీ వాసులు ఓట్లు వేశారని కూల్చివేతలకు దిగినట్టు తెలుస్తోంది. కేవలం ఇళ్లకు మాత్రమే పంచాయతీ అనుమతులు ఉన్నాయని, కాలువలు, అరుగులు, మెట్లకు అనుమతులు లేవని అందుకే కూల్చి వేస్తున్నామంటూ ప్రొక్రెయిన్లతో ధ్వంసం చేశారని బాధితులు తెలిపారు.
అరాచక ప్రభుత్వం
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలు పాటించకపోతే ప్రజలే తగిన సమయంలో బుద్ది చెబుతారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు కప్పం కట్టకపోతే కూల్చివేతలకు పాల్పడతారా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
Must Read ;- జగ్గూ గ్యాంగ్‌ది ఛీప్ మెంటాలిటీ.. నారా లోకేష్