సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ కు పాటల కన్నా రీరికార్డింగులో ప్రత్యేకత చూపే సత్తా ఉంది. తాజాగా ఆయన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. అనంద ప్రసాద్ నిర్మించిన ‘చెక్’ సినిమాకి సంగీతం అందించారు. ఈసారి నేపథ్య సంగీతంతో పాటు పాటల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’పాటను విడుదల చేశారు. నిజానికి ఇందులో ఉన్నది ఈ ఒక్క పాటే. ఈ చెక్ సినిమా ఈనెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కళ్యాణి మాలిక్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే..
* ‘ఐతే…’ తర్వాత చంద్రశేఖర్ యేలేటితో మళ్లీ సినిమా చేసే అవకాశం కోసం 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఈ చెక్ ద్వారా మళ్లీ ఆ కోరిక తీరింది. అప్పటికీ ఇప్పటికీ వర్క్ మీద చందుకీ అదే అంకితభావం ఉంది. ‘ఐతే’ తర్వాత ‘ఆంధ్రుడు’, ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’, ‘ఊహలు గుసగుసలాడే’ చేశాను. అన్నీ నా కెరీర్‌లో చాలా మంచి సినిమాలే. ఇప్పటిదాకా బ్లాక్‌బస్టర్ లేదన్న అసంతృప్తి ఉంది. ఆ లోటును చెక్’ భర్తీ చేస్తుందన్న నమ్మకం ఉంది.
* ‘ఐతే..’ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది. ఈ‘చెక్’లోనూ అంతే. పాటతో సంబంధం లేకుండా చందూ ఎంచుకున్న కథాంశం ఇది. ఆ జైలు వాతావరణం, నితిన్ పాత్ర స్వభావం ఇందులో కీలకం. ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి. ఫైట్ సీక్వెన్సులు గానీ, ఫైట్లు వచ్చిన విధానం ఈసినిమాకి హైలైట్. అందుకే దీనికి రీరికార్డింగు ప్రాధాన్యం ఎంతో ఉంది. ఇప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా సినిమా ఉంటుంది.
* సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాల్సింది. ఎందుకంటే ఐదు పాటలు ఉంటే ఏదో ఒక పాట హిట్ అవడానికి అవకాశం ఎక్కువ. ఒక్క పాటే ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పైగా ఇది సినిమాలో కావాలని పెట్టిన పాట కాదు. రొమాంటిక్ సాంగ్. స్క్రీన్ ప్లేలో భాగంగానే పాట వచ్చింది. మరో పాట పెట్టడానికి ఈ కథలో అవకాశం కూడా లేదు.
* ఒక్క పాట అంటారుగానీ అది చాలా ప్రసవ వేదన. ఒక్క పాట కోసమే 75 ట్యూన్లు ఇచ్చాను. దీని కోసం నాకు 25 రోజులు పట్టింది. నా ట్యూన్లు సాధారణంగా త్వరగా ఓకే అవుతుంటాయి. కానీ దీనికి మాత్రం టైమ్ పట్టింది.
* నా కెరీర్‌లో ఎక్కువ రోజులు నేపథ్య సంగీతం మీద పనిచేసిన సినిమా ఇదే. 30 రోజులు తీసుకోవాల్సి వచ్చింది. రాత్రీ పగలూ పనిచేశాం. రీరికార్డింగ్ పరంగా నాకు మంచి పేరు తెచ్చే చిత్రాల్లో చెక్ ఉంటుంది. ఆ క్రెడిట్ దర్శకుడిదీ, నటులదే. నితిన్ తో మొదటిసారి పనిచేశా. మా కాంబినేషన్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.
* ఏ సినిమాకైనా సంగీత దర్శకుడే మొదటి ప్రేక్షకుడు. నాకు చందూ ఎడిట్ చేయకుండా ఉన్న వెర్షన్ చూపించాడు. ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా రన్‌టైమ్ 2.13 గంటలే. ఇంతకు ముందు రెండున్నర గంటల సినిమాలు వచ్చేవి. డబ్బింగ్ తర్వాత సినిమాలో మరికొన్ని మార్పులు చేశారు. 80 శాతం కథ జైలులోనే జరుగుతుంది.
* నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అవకాశం ఇవ్వమని చాలామందిని నేనే అడుగుతుంటా. తమన్ నాతో ఓ పాట పాడించారు. కల్యాణ్ ధేవ్ ‘సూపర్ మచ్చి’లో ఆ పాట ఉంది. నా ట్యూన్ కాదు కదా కొత్తగా అనిపించింది. నా గొంతు నాకే కొత్తగా ఉంది.
Must Read ;- ట్రైలర్ టాక్: నితిన్ ఎవరికి ‘చెక్’ పెడతాడో?











