సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏ పార్టీలోనైనా అసమ్మతి పెరుగుతుంది. పార్టీ కేడర్ కూడా కొంత డీమోరల్ అవుతుంది. అధికార పక్షం వ్యవహరించే తీరును బట్టి ప్రతిపక్ష అడుగులు ఉంటాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చాలా సానుకూల అంశాలు ఉంటాయి కాబట్టి ఆ పార్టీ గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అయినా ప్రతిపక్ష పార్టీ తన పట్టును నిలుపుకునేందుకు పోటీ చేస్తుంది. ఇది సాధారణంగా రాజకీయాల్లో జరిగేదే.
చాలాచోట్ల కేడర్ పోటీకిసై..
ఇక ఏపీ విషయానికి వస్తే అధికార వైసీపీ– ప్రతిపక్ష టీడీపీ మధ్య ప్రతి అంశంలోనూ యుద్ధమే జరుగుతోంది. అధికార పక్షం గెలిచినా.. టీడీపీ శ్రేణులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాదు..మహా అయితే కేసులు పెడతారు..జేసీబీలు వస్తాయి..ఇంకేం చేస్తారంటూ రివర్స్ అవుతున్నారు. ఈ పరిస్థితులు ఇటీవలివరకు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, బెదిరింపులకు గురిచేస్తోందని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు ఆరోపించిన విషయమూ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచిస్తే…క్షేత్రస్థాయిలో వెంటనే అమలు జరుగుతుంది. ముఖ్యనేతలే వద్దంటున్నారు..మనకు రిస్క్ ఎందుకు అనే కోణంలోనే మెజార్టీ ప్రతిపక్ష నాయకులు, పోటీలో ఉండే అభ్యర్థులు ఆలోచిస్తారు. కాని టీడీపీ విషయంలో ఇక్కడ భిన్నంగా జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చింది. అయితే కేడర్ మాత్రం చాలాచోట్ల పోటీకిసై అంటోంది. టీడీపీ అంటే గిట్టనివారు పార్టీలో క్రమశిక్షణ లోపించిందని చెప్తారు..టీడీపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారు మాత్రం పార్టీ బలమే అది..కార్యకర్తలే పార్టీకి పునాధులు అని మరోసారి నిరూపితమవుతోందని అంటారు. ఎవరి వాదన వారికి ఉంది. ఆ అంశాన్ని పరిశీలిస్తే..
పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రీ నోటిఫికేషన్ జారీ చేయాలని, అఖిల పక్షంతో సమావేశం లేకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందనే కారణంతో బీజేపీ, జనసేన తదితర పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. అదే సమయంలో ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. మంగళవారం తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అధినేత బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినా..
ఇక టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే చాలా చోట్ల పోటీకే తెలుగుతమ్ముళ్లు సై అంటున్నారు. తాము పోటీ నుంచి వెనక్కి తగ్గితే భయపడి వెనక్కి తగ్గినట్టు అవుతుందని, ఏది ఏమైనా పోటీలోనే ఉంటామని చాలాచోట్ల ప్రకటించారు. అదే సమయంలో ..పార్టీ నిర్ణయాన్ని కాదని పోటీచేసినా చర్యలు ఉండవని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు చాలా చోట్ల పోటీకి దిగారు. ఆళ్లగడ్డలో టీడీపీ పోటీలో ఉంటుందని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ప్రకటించారు. ఇక స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలో లేదో నిర్ణయం తీసుకుంటారని టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలోనూ టీడీపీ ప్రచారం నిర్వహిస్తుండగా, విజయనగరం జిల్లాలో ఆ పార్టీ కీలక నేత అశోక్ గజపతిరాజు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే పోటీ చేస్తేనే పార్టీ కేడర్‌లో జోష్ ఉంటుందని ఈ సందర్భంగా పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖలో ఆ పార్టీ నేత గండి బాబ్జీ కూడా పోటీ చేస్తేనే మంచిదని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్నారు. గెలిచినా ఓడినా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే అవకాశంగా భావించాలని కొందరు నాయకులు అభిప్రాయ పడుతున్నారు. అనంతపురం జిల్లాలోనూ టీడీపీ అభ్యర్థులు పోటీకే సై అంటున్నారు.
మరోవైపు గతంలో నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల ఉపసంహరణకు అవకాశం లేకపోవడంతో పార్టీ అభ్యర్థులు పోటీలోనే ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులకు ఫారం-10 జారీచేయడం పూర్తయిన నేపథ్యంలో చాలాచోట్ల పోటీచేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి.
హైకోర్టు తీర్పును బట్టి..
ఇక ఎన్నికల విషయానికి వస్తే.. హైకోర్టు తీర్పును బట్టి ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఎన్నికల సంఘం ఏప్రిల్ 1న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తే.. 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎక్కడైనా అనుకోని కారణాలతో ఎన్నికలకు అవాంతరం ఎదురైతే 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు.
మొత్తం మీద పార్టీ అధిష్టానం వద్దంటున్నా..తెలుగు తమ్ముళ్లు పోటీకే సై అనడం ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు వస్తున్నా.. పార్టీ కేడర్ ఎంత పటిష్టంగా ఉందనేది అర్థం అవుతోందనే చర్చ పార్టీల్లో నడుస్తోంది.
Must Read ;- నిలిచిన చోట నుంచే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ఎస్ఈసీ