హఫీజ్‌పేట భూ వ్యవహారంలో ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులను కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలపై అరెస్టయిన మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బెయిల్‌పై విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె నేరుగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లారు. అనంతరం ఆళ్లగడ్డకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మీడియాతో ఒకే ఒక్క మాట మాట్లాడారు. ‘ ఆళ్లగడ్డలో తాను మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని, అక్కడే అన్ని విషయాలు చెబుతాను’ అని వ్యాఖ్యానించారు. దీంతో అఖిల ప్రియ ఆళ్లగడ్డలో ఏం చెబుతారనే చర్చ నడుస్తోంది.
కేసు ఇదీ..
హఫీజ్‌పేటలో సర్వే నెంబరు 80లో ఉన్న భూముల వివాదానికి సంబంధించి జనవరి 5న హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరులను కొందరు వ్యక్తులు వచ్చి వాహనాల్లో ఎక్కించుకెళ్లారు. అయితే, ఈ వ్యవహారంలో భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి హస్తం ఉందని తేల్చిన పోలీసులు 6న భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అఖిల ప్రియతో కలిపి మొత్తం 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో అఖిల ప్రియ భర్త భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్‌రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ ఇప్పటికీ పరారీలో ఉన్నారు. కాగా భార్గవ్‌రామ్ న్యాయవాదులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో పలుమార్లు బెయిల్ కోసం యత్నించిన అఖిల ప్రియకు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.
అనుమానాలు ఇవీ..
ఈ భూముల వ్యవహారానికి సంబంధించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ, ఆళ్లగడ్డతోపాటు హైదరాబాద్‌లో అఖిల ప్రియకు పరిచయం ఉన్నవారిలోనూ పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అఖిల ప్రియ చెల్లెలు మౌనిక, తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి ఇప్పటికే ఈ అంశంపై పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
- అసలు ఆ భూమి ప్రభుత్వానిది లేదా వేరే సంస్థలది అని నడుస్తున్న వివాదంలో ఆ భూములను అవతలి వర్గం మరో ముఖ్యమైన పారిశ్రామిక వేత్తకు ఎలా ఇస్తుందని, ఆ విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
- ఇక అఖిల ప్రియ కుటుంబంతో అన్ని రాజకీయ పార్టీల్లోని నాయకులకు పరిచయాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల హయాం నుంచి ఈ పరిచయాలు కొనసాగుతున్నాయి. వీరి కుటుంబాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ప్రభుత్వాల్లోని పెద్దలుగా భావిస్తున్నవారు హాజరవుతారు. కొన్ని లావాదేవీలు నిర్వహించిన వారూ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో ఈ భూముల్లో కేవలం అఖిల ప్రియ, భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి లేదా ఆ కుటుంబానికి మాత్రమే పాత్ర ఉంటుందా అనే చర్చ కూడా నడుస్తోంది.
- ఇక అఖిల ప్రియ తనకు నష్టం వస్తుందని తెలిసినా..వివాదం పరిష్కరించుకునేలా రాజీ మార్గం కోసం ప్రయత్నిస్తే.. ప్రత్యర్థి వర్గం అడ్డం తిరిగిందని, అందుకు కీలక వ్యక్తుల సపోర్టు ఉందనే చర్చ సోషల్ మీడియాలో నడిచింది.
- ఇదే విషయంలో తొలుత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల బంధువుల కిడ్నాప్ అని ప్రచారం జరిగింది. తరువాతి కాలంలో ఆ బంధుత్వం అంత దగ్గరైందని కాదని, సదరు కీలక వ్యక్తి దగ్గర సహాయకుడిగా పనిచేసే వారికి బంధువులని చెబుతున్నారు. ఈ కేసులో అఖిల ప్రియను టార్గెట్ చేసేందుకు ఏకంగా సదరు కీలక వ్యక్తి బంధువుల కిడ్నాప్ అని ప్రచారం జరిగిందని చెబుతున్నారు.
- భూమా నాగిరెడ్డికి చానాళ్లపాటు స్నేహితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి ఈ వివాదంలో ఎలాంటి పాత్ర ఉందనే చర్చ కూడా నడుస్తోంది.
- తనను టార్గెట్ చేశారని ఇప్పటికే భావిస్తున్న అఖిల ప్రియ..ఎవరి పేర్లను బయటపెడతారో అనే చర్చ నడుస్తోంది.
- ఈ భూములకు సంబంధించి ఎవరెవరి హస్తం ఉంది, గతంలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఓ గ్యాంగ్ స్టర్ వేల కోట్ల విలువ చేసే ఈ భూముల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉన్నాడా? నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని భూములపై కన్నేసి సెటిల్మెంట్‌లు, దందాలు చేసిన సదరు గ్యాంగ్‌స్టర్ ఈ భూములను వదిలేయడానికి కారణం ఏంటి.. ఆయన డైరీలో దీనికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా..అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
- ఇక ఈ కేసు నుంచి, ఈ భూముల వివాదం నుంచి బయటపడేందుకు అఖిల ప్రియ రాజీమార్గంలో పయనిస్తారా లేక సంచలనాలు వెల్లడిస్తారా అనేది తేలాల్సి ఉంది.
- Must Read ;- మాదాల శీను.. బోయినపల్లి కిడ్నాప్ కేసులో సీనంతా ఇతడిదేనట