టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తనను సోషల్ మీడియా వేదికగా బెదిరించారని శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీపై ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పొన్నూరులో టీడీపీ కార్యకర్త మణిరత్నం అక్రమ అరెస్టును తాను తప్పు పడితే , తన హక్కులకు భంగం కలిగించే విధంగా ఎస్పీ అమ్మిరెడ్డి ట్విట్టర్‌లో తనను ఉద్దేశించి పోస్టింగులు పెట్టారని ఆ నోటీసులో ప్రస్తావించారు.తన హక్కులకు భంగం కలిగించిన ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఆయన మండలి ఛైర్మన్‌ను కోరారు.
పొన్నూరులో గత వారం ఫ్రహారీ గోడ ప్రారంభానికి సంబంధించి పోస్ట్ పెట్టిన మణిరత్నం అనే కార్యకర్తను పోలీసులు అరెస్టు చేయడంతో, దానికి కారణమైన వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. అంతేగాక మణిరత్నం చేసిన తప్పేమిటో పోలీసులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో లోకేష్ పెట్టిన ట్వీట్ పై అర్బన్ ఎస్పీ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని, అలా చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకేష్ కూడ పోలీసుల ట్వీట్‌కు స్పందించి ఎస్పీకి ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ సీసీ టీవి ఫుటేజ్ బయటపెట్టాలన్నారు. మణిరత్నం ఆ పోలీస్ స్టేషన్ వద్ద విడుదలైన ఫోటోను లోకేష్ ట్వట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుంటూరు అర్బన్ ఎస్పీపై లోకేష్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని మండలి ఛైర్మన్‌ను కోరారు.
Also Read: జగన్‌పై ట్వీట్‌లో లోకేష్ ఘాటు కామెంట్!