Telangana CM KCR Meets Union Minister Gajendra Singh Shekhawat :
ఒకే నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రెండు సార్లూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. తొలి సారి భేటీలో ఏ అంశాలనైతే ప్రస్తావించారో, రెండో భేటీలోనూ దాదాపుగా అవే అంశాలను ప్రస్తావించారు. అయితే వరుసబెట్టి రెండు భేటీల్లోనూ ఓ రాష్ట్ర సీఎం ఒకే రకమైన అంశాలతో కూడిన ప్రతిపాదనలను ముందుపెడితే.. గజేంద్ర సింగ్ షెకావత్ ఎలా స్పందించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. కేంద్రం జారీ చేసిన గెజిట్ అమలును వాయిదా వేయాలంటే.. అది ఒక్క గజేంద్ర సింగ్ తోనే సాధ్యమయ్యే పని కాదు. దీనిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో రెండో పర్యాయం తన వద్దకు వచ్చిన కేసీఆర్ కు గజేంద్ర సింగ్ షెకావత్ ఏమని సమాధానం ఇచ్చారన్నదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐదు అంశాలతో కేసీఆర్ లేఖ
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో శనివారం మధ్యాహ్నం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు అరగంటకు పైగానే సాగిన ఈ భేటీలో కేసీఆర్ 5 అంశాలతో కూడిన లేఖను గజేంద్ర సింగ్ కు అందజేశారు. గెజిట్ అమలుపై పలు అంశాలను లేవనెత్తిన కేసీఆర్.. జల వివాదాలు పరిష్కారమయ్యేదాకా గెజిట్ అమలును వాయిదా వేయాలని ఆ లేఖలో కోరారు. అంతేకాకుండా ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే బోర్డుల పరిధిలోకి తీసుకోవాలని, మిగిలిన ప్రాజెక్టులను రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని కూడా కేసీఆర్ కోరినట్టు సమాచారం. అయినా రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కాకుండా గెజిట్ ను అమలులోకి తీసుకువస్తే.. లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుందని కూడా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ముందుగా నీటి వాటాలను తేల్చాలని, ఆ తర్వాతే గెజిట్ అమలును ప్రారంభించాలని కూడా కేసీఆర్ కోరినట్టుటా సమాచారం. మొత్తంగా తన లేఖలో ఐదు అంశాలను కేసీఆర్ ప్రస్తావించినా.. ఆ ఐదు అంశాలు కూడా గెజిట్ అమలును ప్రశ్నిస్తూ సంధించినవేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గెజిట్ అమలు వాయిదా లాంటి కీలక అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించిన నేపథ్యంలో గజేంద్ర సింగ్ షెకావత్ ఎలా స్పందించారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
Must Read ;- మిల్లర్లకు కేసీఆర్‌ను దింపే దమ్ముందా?











