Union Minister Kishan Reddy Sensational Announcement To Resolve Telugu States Water Dispute :
ఏపీ సర్కారు చర్యలతో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని జల వివాదం అంతకంతకూ జఠిలమవుతోంది. తెలంగాణ ప్రాంత వాసులు ఆది నుంచి అభ్యంతరం చెబుతున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని భారీగా పెంచుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట జగన్ సర్కారు చకచకా పనులను చేపడుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సాగుతున్న ఈ పనులపై తెలంగాణ అభ్యంతరం చెప్పింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించిన తెలంగాణ.. కృష్ణా జలాల్లో ఏకంగా తమకు సగం మేర వాటా కావాలంటూ కొత్త వాదనలను తెర మీదకు తెచ్చింది. అయితే 30 శాతం వాటాకే ఒప్పందంపై సంతకాలు పెట్టిన తెలంగాణ.. ఇప్పుడు ఏకంగా 50 శాతం నీటి వాటాలను కోరడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ.. అసలు తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులన్నీ అక్రమమేనని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరు రాష్ట్రాల పరస్పర ఆరోపణలు తారా స్థాయికి చేరడంతో మధ్యేమార్గంగా వ్యవహరిస్తానంటూ ఎంట్రీ ఇచ్చిన కేంద్రం.. కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాలపైనా కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డులకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ ఏకంగా గెజిట్ జారీ చేసి పారేసింది. వెరసి ఇరు రాష్ట్రాలు వాదులాడుకుని మొత్తం అధికారాన్ని కేంద్రం చేతిలో పెట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.
కిషన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చేశారు
రెండు రాష్ట్రాలు జలాల కోసం పోట్లాడుకుంటున్న నేపథ్యంలో పెద్దన్న బాధ్యతలను భుజానికెత్తుకున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ఈ వివాద పరిష్కార బాధ్యతలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. మోదీ నుంచి ఆదేశాలు అందుకున్న కిషన్ రెడ్డి శనివారం సంచలన ప్రకటన చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం పరిష్కారమయ్యేలా చర్చలు జరగాలని కిషన్ రెడ్డి ప్రకటించారు. జల వివాద పరిష్కారానికి కేంద్రం సిద్ధంగా ఉందని, రెండు రాష్ట్రాలు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా సాగేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ కు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్, జగన్ లు వివాద పరిష్కారానికి ముందుకు వస్తే.. ఆ సమస్యను తాను సామరస్యపూర్వకంగానే పరిష్కరిస్తానని కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సామరస్యపూర్వక పరిష్కారంలో భాగంగానే కేంద్రం గెజిట్ విడుదల చేసిందని కూడా కిషన్ రెడ్డి ప్రకటించారు.
కేసీఆర్ పర్యటన ఎఫెక్టేనా..?
ఇటీవలే పార్టీ కార్యాలయం భూమి పూజ కోసమంటూ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలను వరుసబెట్టి కలిశారు. ఈ భేటీల్లో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్నే కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించినట్లుగా వార్తలు వినిపించాయి. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎవరి అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని భారీగా పెంచేస్తోందని, ఈ చర్యలన్నీ రాజ్యాంగ విరుద్ధమేనని కేసీఆర్ ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే జగన్ కు కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందన్న వార్తలూ వినిపించాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు కిషన్ రెడ్డి ఎంట్రీ ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించే బాధ్యత తనదేనన్న కోణంలో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి ప్రతిపాదనకు కేసీఆర్ సుముఖంగానే ఉన్నా.. ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారన్నదనే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.
Must Read ;- రఘురామ సెటైర్లతో జగన్ ఉక్కిరిబిక్కిరి