మన దేశం నుంచి తెలుగు దేశం దాకా ఆయనది మహాపయనం. ఆయనే ఎన్టీఆర్ – చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరిది. ఈ యుగపురుషుడి శతజయంతి ఉత్సవాలలోకి అడుగుపెట్టబోతున్నాం.
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ చరిత్ర, మరో నాలుగు దశాబ్దాల నటనా చరిత్ర వెరసి ఓ ఎన్టీఆర్. ఎందరో మహానుభావుల్లో ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. తెలుగు జాతి గర్వించే ముద్దు బిడ్డ జన్మించింది మే 28వతేదీ. 1923లో కృష్ణా జిల్లా నిమ్మకూరులో పుట్టి కళామతల్లి ఒడిలో ఒదిగిన మహనీయుడాయన. ఆయన మాట పడడు, మడమ తిప్పడు, మాట తప్పడు. ఆయన్ను దైవంలా ఆరాధించారు, అన్నలా అక్కున చేర్చుకున్నారు. ఆయన పయనం అంతం లేనిది, ఆయన జననం మరణంలేనిది.
హీరోగా ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేసి చంకలు గుద్దుకుంటున్న రోజులివి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఒకేరోజు మూడు నాలుగు చిత్రాల షూటింగుల్లో పాల్గొన్న ఘనత మహానటుడు ఎన్టీఆర్ కే దక్కుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం, ఇక ముందెన్నడూ ఎరగని నగ్నసత్యం. అవిశ్రాంత నటనాయోధుడాయన. నమ్మిన సిద్ధాంతం కోసం మడమ తిప్పకుండా పోరాటం చెయ్యటం ‘ఆయన’ నైజం. ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవటమే ‘ఆయన’కున్న ఏకైక ఇజం. ఇది జగమెరిన నిజం. ఒక నటుడిని ఇంతలా ఆరాధించే, అభిమానించే జనం వేరెవరికీ ఉండరు.
అందుకే ఆయన తన ఇంటికి వచ్చిన అభిమానుల్ని కలవకుండా షూటింగులకు వెళ్లరు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడంతో ప్రారంభమయ్యే ఆయన దినచర్య మళ్లీ నిద్రపోయేవరకూ అవిశ్రాంతంగా సాగుతుంది. ఆయన పడే శ్రమకు కాలం కూడా అసూయపడుతుంది. ఎన్నెన్ని పాత్రలు, ఎన్నెన్ని సినిమాలు.. అరవైలోనూ ఇరవై హీరోలా తెలుగు ప్రజల మనసు కొల్లగొట్టారు. అందానికి అసూయ కలిగించే రూపం.. అంతకుమించిన స్ఫరద్రూపం.. ఇదీ ఎన్టీఆర్ అంటే.
Must Read ;- ఎన్టీఆర్ రత్నం కాదా?.. భారతరత్న ఎందుకు రాదు?
వైవిఎస్ చూపించిన సినిమా..
ఎన్టీఆర్ అంటే ఎంతటి వీరాభిమానమో తెలియాలంటే వైవిఎస్ చౌదరి లాంటి దర్శకులు ఆయన జీవితంతో సినిమానే చూపించేస్తారు. తన ఆధ్వర్యంలో ఆయన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల రూపకల్పన కూడా చేశారు. ఆ విశ్వవిఖ్యాత దివ్యమోహన తేజోరూపాన్ని ‘సజీవ’ చిత్రరాజంగా ఆయన ఎలా వర్ణించారో చూద్దాం. తెలుగు’జాతిరత్నంగా, వెండితెరవేల్పుగా ‘రుధిరోద్గారి’ నామ సంవత్సరం, గ్రీష్మ రుతువు, శుక్లపక్ష త్రయోదశి, తులారాశి, తులాలగ్నం, స్వాతి నక్షత్రం 4వ పాదంలో 28 మే, 1923న మధ్యాహ్నం 04.26 గంటల ‘మ్యాట్నీ’ ఆటతో నిమ్మకూరు‘లో ఎన్టీఆర్ అనే సజీవ చిత్ర రాజం విడుదలైందట.
ఆ తర్వాత ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఆటలు వేసినా విశ్రాంతి కార్డు లేకుండా ‘శుభం’ కార్డు పడకుండా ‘ప్రేక్షకుల కళ్ళు’ అనే తెర మీద అనంతంగా ఈ ఆట ప్రదర్శితమవుతూనే ఉంటుందట. వాళ్ళ మనసులపై శాశ్వత ముద్రని ముద్రిస్తూనే ఉంటూనే ఉంటుందట. ఎన్టీఆర్ తన ఆశయాలు, ప్రసంగాల ద్వారా ఎంతో మందిలో ఉద్వేగాన్ని కలిగించారు. తన సినిమాలతో మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడిన ఓ కారణజన్ముడిగా ఆయన అవతరించారు అంటూ వర్ణిస్తున్నారు వైవిఎస్ చౌదరి.
ఎన్టీఆర్ @ బ్యానర్ కు అంకురార్పణ
వైవిఎస్ చౌదరి అభిమానం NTR@ అనే కొత్త బ్యానర్ ఏర్పాటుదాకా వెళ్లింది. కొత్త కళాకారుల పరిచయ వేదికగా ఆయన దీన్ని తీసుకువెళ్లబోతున్నారు. దీన్ని ఆయన న్యూ టాలెంట్ రోర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సమకాలీకులు, సన్నిహితులు, సహచరులు, అధికారులు, ఆయనతో పనిజేసిన సిబ్బంది, ఇంకా ఆయనతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న అందరితోనూ మాట్లాడి ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలుగా మలిచి రాబోయే ఆయన శత జయంతి 28 మే, 2022 రోజు నుంచి 27 మే 2023 వరకూ వాటిని రకరకాల డిజిటల్ వేదికల ద్వారా జ్ఞాపకాల రూపంలో ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజలకు చేరువ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఒక్క చౌదరి మాత్రమే కాదు ఈ ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనూ ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఎన్టీఆర్ వారసులు కూడా ఈ బృహత్తర కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ శతజయంతి ఏడాదిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయనున్నారు.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- ఎన్టీఆర్ స్మారకంగా నందమూరి బాలకృష్ణ శ్రీరామదండకం