The Daughter Of Teenmar Mallanna Who Joined In ICU With Anxiety Over Her Father :
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తీర్మాన్ మల్లన్న అలియాజ్ చింతపండు నవీన్ కుమార్ కు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. కేసీఆర్ సర్కారు పెట్టిన కేసుల కారణంగా ప్రస్తుతం మల్లన్న జైల్లో ఉండిపోగా.. ఆయన కూతురు మాత్రం తండ్రిపై బెంగతో ఏకంగా ఆసుపత్రి పాలైంది. ఈ తరహా కష్టం పగోడికి కూడా రావద్దన్న దిశగా ఈ వార్త వైరల్ అయిపోయింది. జర్నలిస్టుగా వృత్తి జీవితం మొదలెట్టిన తీన్మార్ మల్లన్న ఓ వైపు తన ఉద్యోగం చేసుకుంటూనే.. మరోవైపు రాజకీయంగా యమా యాక్టివ్ గా మారిపోయారు. మొన్నటి పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన మల్లన్న.. ఓ దశలో పల్లాను ఓడిస్తారన్న భావననూ కలిగించారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఈ ఎన్నికల్లో పల్లా గెలిచినా.. మల్లన్న దెబ్బకు బిక్కచచ్చిపోయిన వైనం తెలిసిందే. ఆ ఎన్నిక ముగియగానే.. టీఆర్ఎస్ సర్కారు మల్లన్నను టార్గెట్ చేసినట్టుగా వరుసగా పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
జ్యోతిష్యుడి ఫిర్యాదుతో అరెస్ట్
ఈ క్రమంలో తన సంస్థలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి పట్ల మల్లన్న అనుచితంగా మాట్లాడారంటూ మల్లన్నకు చెందిన యూ ట్యూబ్ ఛానెల్ కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులు.. మల్లన్నను అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కేసులో మల్లన్నను అరెస్ట్ చేసేంతమేర ఆధారాలు దొరకలేదని సమాచారం. అయితే తనను రాజకీయంగా ఎదర్కోలేకే కేసీఆర్ సర్కారు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మల్లన్న ఆరోపించారు. అయినా కూడా వెనక్కు తగ్గని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఒక కేసులో మల్లన్నను అరెస్ట్ చేసి తీరాలన్న దిశగా కదిలిందన్న వాదనలూ వినిపించాయి. ఇందులో భాగంగా చాలా కాలం క్రితమే ప్రముఖ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ తనను డబ్బుల కోసం మల్లన్న బ్లాక్ మెయిల్ చేశాడన్న ఆరోపణలపై చిలకలగూడ పోలీసులు నమోదు చేసిన కేసును ఆధారంగా చేసుకుని మల్లన్నను ఇటీవలే అరెస్ట్ చేశారు. కేసు విచారణ కోసం.. కోర్టు మల్లన్నకి సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది. తరువాత.. మల్లన్న భార్య బెయిల్ పిటిషన్ వేయడం, కోర్టు దాన్ని తోసిపుచ్చడం అన్నీ చకచకా జరిగిపోయాయి. వెరసి మల్లన్న ప్రస్తుతం జైల్లోనే ఉంటున్నారు.
తండ్రిపై బెంగతో ఆసుపత్రికి..
ఇదిలా ఉంటే.. మల్లన్న దంపతులకు ఓ కూతురు ఉందన్న విషయం తెలిసిందే. ఐదేళ్లు కూడా నిండని ఆ పసిపాపకు తండ్రి మల్లన్నతో అటాచ్ మెంట్ ఎక్కువేనట. నిత్యం తండ్రి తనకు కనిపించాల్సిందేనని ఆ బాలిక పట్టుబట్టేదట. కూతురిపై ప్రేమతో మల్లన్న కూడా ఏం చేసినా.. ఎటు తిరిగినా కూడా కూతురుకు అందుబాటులోనే ఉండేలా ప్లాన్ చేసుకునేవారట. అయితే ఇప్పుడు జైల్లో ఉన్న మల్లన్న కూతురుకు ముఖం చూపే అవకాశం లేదు కదా. అది కూడా ఒకరోజో, రెండు రోజులో కాదు కదా. పది రోజులకు పైగా మల్లన్న జైల్లోనే ఉంటున్నారు. అంటే.. ఆ పాపకు పది రోజులుగా తండ్రి కనిపించడం లేదు. దీంతో తండ్రిపై బెంగ పెట్టుకున్న ఆ బాలిక అన్నం తినడం మానేసిందట. ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ బాలికను ఆసుపత్రికి తరలించగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు ఆమెను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారట. మరి మల్లన్న ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారో, ఎప్పుడు ఆ బాలిక అనారోగ్యం నుంచి బయటపడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Must Read ;- జగన్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినట్టే!