‘వర్క్ ఫ్రమ్ హోమ్’.. కరోనా, లాక్ డౌన్ పుణ్యాన బాగా పాపులర్ అయిన కొన్ని పదాల్లో ఇదీ ఒకటి. ఆఫీసులకు వెళ్లే అవసరమే లేకుండా ఇంట్లో కూర్చునే పనులు చక్కబెట్టకునే వ్యవహారమిది. దీనికి బాగా అలవాటు పడిపోయిన ఆఫీసులు.. తమ ఉద్యోగులకు దీన్నే లాక్ డౌన్ తర్వాత కూడా కొనసాగించేస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు ఉద్యోగులకు ఇల్లు కూడా బోరు కొట్టేస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన ఓ ముగ్గురు యువకులు.. ఇందులోనే ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అదే..
‘వర్క్ ఫ్రమ్ సైకిల్’. .
నెలల తరబడి ఇంట్లో కూర్చుని పని చేసీ చేసీ విసిగి వేసారి పోయిన జార్జ్, అల్వీల్ జోసెఫ్, రాతీష్ భలేరావ్ అనే ముగ్గురు యువకులు.. దేశయాటన చేయాలని నిర్ణయించుకున్నారు. దేశ పర్యటన తనగానే.. ఏ విమానమో.. రైలో.. బస్సులోనో అనుకునేరు. అస్సలు కాదు.. కాస్త వినూత్నంగా ప్రయత్నించడానికి సైకిలెక్కి బయలుదేరారు ఈ ముగ్గరు యువకులు. సైకిళ్లు తీసుకుని ఎంత దూరం వెళ్లగలరేంటని చులకన చేయకండి.. ఏకంగా బ్యాక్సెన్ ముంబయి నుంచి కర్ణాటక మీదుగా కన్యాకుమారిని చుట్టేయాలని నిర్ణయించారు.
Also Read ;- సృష్టి గోస్వామి.. ఒక్కరోజు ముఖ్యమంత్రి!
24 రోజులు.. 1600 కిలో మీటర్లు..
సైకిల్ మీద దేశ యాత్రకు బయలుదేరిన ఈ కుర్రాళ్లు మధ్య మధ్యలో హోటళ్లు, చిన్న షాపుల వద్ద ఆగి ఆఫీస్ పనులు చేసుకొనేవారు. పని పూర్తికాగానే.. మళ్లీ సైకిలింగ్ చేసేవారు. ఇలా వారు 24 రోజుల్లో 1,600 కిలో మీటర్లు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు ఒక్క రోజు కూడా ఆఫీస్‌కి సెలవు పెట్టకపోవడం గమనార్హం. ఇలా.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఉద్యోగానికి ఉద్యోగం.. జీతానికి జీతం.. వీరి పనేదో బాగుందే.. అనుకుంటున్నారా! అయితే ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మొదలెట్టేయండి.. ఈ వర్క్ ఫ్రమ్ సైకిల్ యాత్రని..!
Must Read ;- దేశంలోనే పిన్నవయస్కురాలైన మేయర్ ‘ఆర్యా రాజేంద్రన్’