‘యమదొంగ’ .. ‘మగధీర’ .. ‘బాహుబలి’ .. తెలుగు సినిమా ఘనతను పెంచుతూ వెళ్లాయి. ఈ సినిమాలు చూసినవారు, జానపద .. చారిత్రక .. పౌరాణిక చిత్రాలను రాజమౌళి అద్భుతంగా తీయగలరనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రామాయణం .. మహాభారతం వంటి ఇతిహాసాలను ఆయన గొప్పగా మలచగలరనే నమ్మకాన్ని వాళ్లు వ్యక్తం చేశారు. చూస్తుంటే రాజమౌళి అడుగులు ఆ దిశగానే పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆయన ఒక చారిత్రక చిత్రాన్ని లైన్లో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ చారిత్రక చిత్రం పేరే .. ‘ఛత్రపతి శివాజీ‘.
రాజమౌళి తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో తీయాలనుకుంటున్నాడనే విషయం తెలిసిందే. ‘ఛత్రపతి శివాజీ’ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. శివాజీ బాల్యం .. విద్యాభ్యాసం .. సమర్థ రామదాసును గురువుగా స్వీకరించడం .. గురువు పెట్టిన కఠిన పరీక్షలకు నిలవడం .. భవానీదేవి భక్తుడిగా ఆయన విశ్వాసాలు .. ఆయన వీరత్వం .. విజయయాత్రలు ఇలా ఒక సినిమాకి కావలసిన అన్నిరకాల అంశాలు ఆయన జీవితచరిత్రలో పుష్కలంగా కనిపిస్తాయి.
ఈ నేపథ్యంలో శివాజీ జీవితంలోని ఇతర కోణాలను కూడా పరిశీలించి .. పరిశోధించి కమర్షియల్ హంగులను జోడించడానికి విజయేంద్రప్రసాద్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రాజమౌళి కథను గురించి తెలుసుకుంటూ .. తన అభిప్రాయాలను చెబుతూ వెళుతున్నాడని అంటున్నారు. ‘ఛత్రపతి శివాజీ’ పాత్రకి మహేశ్ బాబు కరెక్ట్ గా సరిపోతాడనే విషయంలో ఎలాంటి సందేహంలేదు. అయితే చారిత్రకాలు .. పౌరాణికాలు మనవల్ల కాదమ్మా అని గతంలో చెప్పిన మహేశ్ బాబు, ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అనే విషయంలోనే క్లారిటీ రావలసి ఉంది.
Must Read ;- దొరస్వామిరాజు పార్ధివ దేహం వద్ద రాజమౌళి నివాళి