మహేశ్ బాబు అభిమానులంతా ఇప్పుడు ‘సర్కారువారి పాట‘పై దృష్టిపెట్టారు. పరశురామ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. అయితే ఫస్టు షెడ్యూల్ విషయంలో దర్శక నిర్మాతలు తమ ప్లాన్ మార్చుకున్నారు. హైదరాబాద్ లో జరపవలసిన షెడ్యూల్ ను వాయిదా వేసుకుని, దుబాయ్ షెడ్యూల్ ను ముందుగా పూర్తిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రధాన పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
‘గీత గోవిందం’ హిట్ తరువాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తరువాత మహేశ్ బాబు చేస్తున్న సినిమా కావడం వలన అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్ కనబడుతుండటం కూడా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణమవుతోంది. మహేశ్ బాబు వంటి స్టార్ హీరోతో సినిమా చేయడం పరశురామ్ కి ఇదే మొదటసారి. అందువలన ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలనే గట్టిపట్టుదలతో ఆయన ఉన్నాడు.
మహేశ్ బాబు యాక్షన్ తో పాటు రొమాంటిక్ కామెడీని ఎక్కువగా ఇష్టపడతాడు. తన సినిమాలో అవి ఎంతమాత్రం తగ్గకుండా ఆయన చూసుకుంటాడు. అవన్నీ ఈ సినిమాలో సమపాళ్లలో ఉండటం వల్లనే ఆయన అంగీకరించాడని అంటున్నారు. కొంతకాలంగా ఒకదానికి మించిన హిట్ మరొకటి ఇస్తూ వస్తున్న మహేశ్ బాబు ఈ కథకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే, కథలో విషయం ఉందనే విషయం అర్థమవుతోంది. మహేశ్ విజయయాత్రకు ఈ ఏడాది కూడా ఎలాంటి అవరోధం లేకుండా ఈ సినిమా చూసుకుంటుందనే నమ్మకంతోనే అభిమానులు ఉన్నారు.
Must Read ;- సంక్రాంతి వాకిట్లో కనువిందైన కలర్ఫుల్ జోడీ!











