టాలీవుడ్ లో ఎన్నో మంచి చిత్రాల్ని నిర్మించిన అన్నంరెడ్డి కృష్ణ కుమార్ కన్నుమూశారు. విశాఖపట్నంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఉదయం గుండెపోటు తో తుదిశ్వాస విడిచారు. ‘ఈ పిల్లకి పెళ్ళవుతుందా, కలికాలం ఆడది, డామిట్ కథ అడ్డం తిరిగింది, ఈ దేశంలో ఒకరోజు’ లాంటి సందేశాత్మక చిత్రాలు నిర్మించారు. ఇంకా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన ‘సఖియా నాతో రా’ చిత్రం కూడా ఆయన నిర్మించిందే. అలాగే.. దర్శకుడు మారుతితో కలిసి ‘బెస్ట్ యాక్టర్స్’ చిత్రాన్ని నిర్మించారు.
రీసెంట్ గా ఫహద్ ఫాజిల్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అతిరన్’ అనే మలయాళ సినిమాను కృష్ణ కుమార్ తెలుగులోకి ‘అనుకోని అతిథి’ పేరుతో డబ్బింగ్ చేశారు. కోవిడ్ కారణంగా థియేటర్స్ లో విడుదల కాలేకపోయిన ఈ సినిమా త్వరలో ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే మరో మలయాళ చిత్రం ‘తన్నీర్ మత్తన్ దినంగల్’ అనే మలయాళ మూవీని కూడా తెలుగులో రీమేక్ చేసే సన్నాహాల్లో ఉండగా.. ఆయన తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిపోవడం దురదృష్టకరం.
ఇక ‘వంశవృక్షం, తూర్పువెళ్ళేరైలు, మరోమలుపు, మల్లెపందిరి’ చిత్రాల్లో కథానాయికగా నటించిన జ్యోతి.. కృష్ణకుమార్ భార్యనే. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. జ్యోతి కొన్నేళ్ళ క్రితం కన్నుమూశారు. కృష్ణకుమార్ మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియచేశారు.
Must Read ;- కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి











