తానొకటి తలిస్తే దైవం ఇంకోలా తలుస్తాడని మన పెద్దలు ఊరికే అనలేదేమో. నటుడు కొంగర జగ్గయ్య ఊహించింది ఒకటి.. చివరికి జరిగింది ఇంకొకటి. జగ్గయ్య ఏం ఊహించాడు.. ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం. కృష్ణ అనే ఓ బుర్రిపాలెం బుల్లోడు ఇంకా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటున్న రోజులవి. అప్పటికే నటుడు జగ్గయ్య సినిమాల్లో ఉన్నారు. జగ్గయ్యకు జాతకాలంటే విపరీతమైన నమ్మకం. ఆయన ఏ పనిచేసినా జ్యోతిష్కులను సంప్రదిస్తారట. సొంతంగా సినిమా నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఓ జ్యోతిష్కుడిని కలిశారు.
ఆయన జాతకం చూసి ‘నువ్వు తీసే సినిమా ద్వారా పరిచయమయ్యే కుర్రాడు ఆ తర్వాత పెద్ద హీరో అయిపోతాడు’ అని చెప్పారట. ఇదేదో బాగుందే అనుకున్నారు జగ్గయ్య. ఎందుకంటే ఆయన తమ్ముడి పేరు అదే మరి. భవిష్యత్తులో వాడు పెద్ద హీరో అయిపోతాడు అని ఊహించేసుకున్నారు జగ్గయ్య. తను తీసే సినిమాలో తమ్ముడు కృష్ణకు అవకాశం ఇచ్చేశాడు. ఆ సినిమా పేరు ‘పదండి ముందుకు’. విక్టరీ మధుసూదనరావు దీనికి దర్శకుడు. ట్విస్టు ఏమిటంటే జగ్గయ్య తమ్ముడు కృష్ణ హీరో కాలేకపోయాడు. అదే సినిమాలో గుంపులో గోవిందయ్యలా ఉన్నాడో కుర్రాడు. అతనే ఘట్టమనేని శివరామకృష్ణ. జ్యోతిష్కుడు చెప్పింది నిజమే అయ్యింది.
ఆ శివరామకృష్ణే తదనంతర కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అయ్యాడు. అందరూ కృష్ణ తొలి సినిమా ‘తేనెమనసులు’ అనుకుంటారు.. ‘పదండి ముందుకు’ ఆయన తొలిచిత్రం. ఎన్టీఆర్ ‘మన దేశం’లో చిన్న పాత్ర వేసినట్టుగానే కృష్ణ కూడా ఎవరూ గుర్తించలేని చిన్నపాత్ర ద్వారా ‘పదండిముందుకు’తో పరిచయమయ్యారు. ఆ తర్వాత కులగోత్రాలు, పరువు ప్రతిష్ట చిత్రాలలో కూడా చిన్న పాత్రలు పోషించారు. ‘పదండి ముందుకు’ 1962 విడుదలైతే ‘తేనెమనసులు’ 1965లో విడుదలైంది. మొత్తానికి జగ్గయ్య జాతకాల పిచ్చి కమ్యూనిస్టు భావజాలం ఉన్న విక్టరీ మధుసూదనరావును కూడా జాతకాల వైపు ఆలోచించేలా చేసిందట.