ముంబయిలో ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కొందరిని పోలీసులను అరెస్ట్ చేయగా.. మరికొందరి పేర్లు వెల్లడి కావడంతో వారిని అదుపులోకి తీసుకోనున్నారు.
స్టార్ హోటల్ నుంచే..
నారిమన్ ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ నుంచి వాజే వసూళ్ల దందా నిర్వహించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ హోటల్‌లోని ఓ గదిని వాజే కోసం ఓ పారిశ్రామికవేత్త 100 రోజులకు రూ.12 లక్షలు చెల్లించి బుక్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో ఆ పారిశ్రామికవేత్తకు కొన్ని వివాదాల్లో వాజే సహకరించినట్లు తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాజే ఆ హోటల్ గదిలో కొన్ని రోజుల పాటు గడిపారని, అప్పుడు ఆయన ముంబయి క్రైం బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టు రికార్డుల్లో ఉన్నట్లు ఎన్ఐఏ అధికారి పేర్కొన్నారు. ఆ సమయంలోనే వాజే బృందం ముంబయిలోని పలు ప్రముఖ సంస్థల్లో తనిఖీలు నిర్వహించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎన్ఐఏ అదుపులో వాజే సన్నిహితురాలు?
ఎన్ఐఏ గురువారం దక్షిణ ముంబయిలోని ఓ హోటల్, క్లబ్‌తో పాటు థాణె జిల్లాలోని ఓ అపార్టుమెంట్‌లోనూ సోదాలు నిర్వహించింది. ముంబయి ఎయిర్‌పోర్టులో వాజే సన్నిహితురాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు మొత్తం 35 మంది పోలీస్ అధికారులను ఎన్ఐఏ విచారించి స్టేట్‌మెంట్‌లను నమోదు చేసింది. వాజే దందా గురించి సీనియర్ పోలీసు అధికారుల్లో చాలా మందికి తెలుసని, తమ వద్ద ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎన్‌ఐఏ అధికారులు అంటున్నారు.