(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనతో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యంతో విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తాను పట్టణంలో కొత్తగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మూసివేసి, బోర్డును తొలగించారు. అదే తరుణంలో ఆమె వేరొక కొత్త అంశాన్ని లేవనెత్తి టీడీపీ వర్గాల్లో ఉత్కంఠకు తెరలేపారు.
అందరి కోసం ..
విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రంగ ప్రవేశం చేశారు. తాను ప్రారంభించిన టీడీపీ కార్యాలయం బోర్డు తీసేయాలని గీతను కోరారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అందరి కోసం విజయనగరంలో కొత్త టీడీపి కార్యాలయం ఏర్పాటు చేస్తే.. తన కార్యాలయం బోర్డు తొలగిస్తానని మీసాల గీత స్పష్టం చేశారు. అశోక్ బంగ్లాకు బదులుగా విజయనగరంలో టీడీపీ కొత్త కార్యాలయం ప్రారంభించేందుకు సర్క్యులర్ జారీకి అచ్చెన్నాయుడు హమీ ఇచ్చారు. అచ్చెన్నాయుడు హామీ మేరకు.. తమ కార్యాలయం బోర్డును మీసాల గీత వర్గం గురువారం తొలగించారు. అదే తరుణంలో జిల్లా టీడీపీకి కార్యాలయం ఏర్పాటు చేయకపోతే.. మరల కార్యాలయం ఏర్పాటుకు సిద్దమంటూ మీసాల గీత ఈ సందర్భంగా సుస్పష్టం చేశారు.
Must Read ;- అశోక్ గజపతికి అవమానం జరిగితే నాకూ జరిగినట్టే : చంద్రబాబు