(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీకి విజయనగరంలో దశ, దిశ నిర్దేశించిన పూసపాటి అశోక్ గజపతిరాజు కోటలో కలవరం రేకెత్తింది. జిల్లా తెలుగుదేశం పార్టీకి ఏకైక పార్టీ కార్యాలయంగా ఉన్న అశోక్ బంగ్లాకు ప్రత్యామ్నాయంగా ఆ బంగ్లాకు అతి దగ్గరగానే టీడీపీకి చెందిన విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బుధవారం వేరే కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ‘అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!’ అనే శీర్షికతో లియో న్యూస్ డాట్ కామ్ ముందే చెప్పింది. తాజాగా అది అక్షర సత్యం అయింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు విజయనగరం టికెట్ రాకుండా అడ్డుపడిన అశోక్ గజపతిరాజుపై ఇంతవరకు పరోక్షంగా పోరాడుతున్న గీత ఇకపై ప్రత్యక్ష యుద్ధానికి తెర లేపారు. సామాజిక ప్రాబల్యం, రాజకీయ కుటుంబ నేపథ్యం గల గీత తనతో పాటు ఒక వర్గాన్ని ‘కోట’ నుండి బయటకు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. దాంతో ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది.
బస్తీ మే సవాల్
బస్తీ మే సవాల్ అంటూ గీత మీసం మెలేశారు. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో తనకి అడ్డుపడటంతో పాటు పార్టీలోనూ సరైన స్థానం లేకుండా చేసిన అశోక్ గజపతి రాజు ప్రాభవానికి బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా చంద్రబాబుకు కూడా కొత్త సవాల్ విసిరారు. ఆయన బుజ్జగింపులను పెడచెవిన పెట్టి తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా ‘తన రూటే సెపరేటూ’ అంటూ మరోమారు నిరూపించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున విజయనగరం అసెంబ్లీ నుండి పోటీ పడిన గీత ఆనాటి టీడీపీ అభ్యర్ధి అశోక్ గజపతిరాజుకు చుక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో తాను ఓడినా పెద్ద సంఖ్యలో ఓట్లు సంపాదించారు. దానికి ఆమె కుటుంబ నేపధ్యంతో పాటు బలమైన తూర్పు కాపు సామాజికవర్గం కలిసివచ్చాయనేది నిర్వివాదాంశం.
Must Read ;- సరికొత్త ప్రారంభానికి చంద్రబాబు దిశానిర్ధేశం
‘గంటా’తో టీడీపీ ఎంట్రీ
2014 అసెంబ్లీ ఎన్నికల సమయానికి మీసాల గీత తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుతో పాటే టీడీపీలో చేరారు. ఆమెకు విజయనగరం అసెంబ్లీ టీడీపీ టికెట్ దక్కేలా గంటా చక్రం తిప్పారు. ఈ దెబ్బతో అశోక్ లోక్ సభకు పోటీ చేయాల్సి వచ్చింది. విజయనగరంలో తన రాజకీయ పట్టు ఎక్కడ జారిపోతుందోనని అశోక్ అడుగడుగునా గీతకు అడ్డు తగిలినప్పటికీ ఆయన్ని దాటుకుని మరీ ముందుకు వెళ్ళారు. దానికి విజయనగరం జిల్లా ఇంచార్జి మంత్రి హోదాలో గంటా కూడా నాడు సహకరించారు. ఇక 2019 ఎన్నికల నాటికి మాత్రం అశోక్ పట్టుబట్టి మరీ తన కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ తెచ్చుకున్నారు. కానీ ఆమె ఓడిపోయింది. దాని వెనక కూడా మీసాల గీత మద్దతుదారులు ఉన్నారని ప్రచారం అయితే జోరుగా సాగింది.
ఎదురు చూసినా ..
అదితి ఓడిన తరువాతనైనా ఆమెను పక్కన పెట్టి తనకు నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు చంద్రబాబు అప్పగిస్తారని మీసాల గీత ఎదురు చూసినా ఉపయోగం లేకపోయింది. ఈ విషయంలో ఆమె విన్నపాలు చేసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో నాటి నుంచి ఆమె పార్టీకి దూరంగానే ఉంటున్నారు. విజయనగరంలో తన మద్దతుదారులతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయనగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తూర్పు కాపులు ఉన్నారని, అయినా తనకు అన్యాయం జరిగుతోందని అవకాశం వచ్చినప్పుడల్లా వాపోతున్నారు. పట్టించుకునేవారు లేకపోవడంతో ఏకంగా తన వర్గంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక టీడీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read ;- వైసీపీ గూటికి బొబ్బిలి రాజులు ..?